ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణతో పనులు ఊపందుకుంటున్నాయి. ఇరిగేషన్ శాఖ కూడా అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన గేట్ల ఏర్పాటు ప్రక్రియ ఓ వైపు కొనసాగుతుండగానే మరోవైపు స్పిల్ చానెల్ లో కాంక్రీట్ పనులను అధికారులు మొదలుపెట్టారు. 2020 జూలైలో గోదావరి నదికి వచ్చిన వరదల కారణంగా స్పిల్ చానెల్ మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులకు బ్రేక్ పడింది.
3టీఎంసీల నీరు ఎత్తిపోత
స్పిల్ వే ఛానల్ నిర్మాణ ప్రాంతంలో దాదాపు 3 టీఎంసీలకు పైగా వరద నీరు నిలిచింది. దీంతో గతేడాది జూన్ నుంచి స్పిల్ వే ఛానల్ కాంక్రీట్, మట్టి తవ్వకం పనులు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ గత ఏడాది నవంబర్ నుంచి 70 భారీ పంపు సాయంతో నీటిని తోడి పోసింది. ఇప్పటివరకు 2.5 టీఎంసీల నీటిని గోదావరిలో తోడిపోసినట్లు మేఘా ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. నీటి తవ్వకం దాదాపు పూర్తికావడంతో మట్టితవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఇప్పటివరకు 1,10,033 క్యూబిక్ మీటర్ల కాంక్రరీట్ పనులు పూర్తికాగా.. స్పిల్ ఛానెల్ లో 10,64,417 క్యూబిక్ మీటర్ల మట్టితవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను ఈ ఏడాది జూన్ లోగా పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్ వద్ద ప్రత్యేక పూజలు చేసి కాంక్రీట్ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖకు చెందిన AEE పద్మకుమార్, DEE దామోదరం, మేఘా ఇంజనీరింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మత్తి అలగన్, అసిస్టెంట్ మేనేజర్ పి.చంద్ర మోహన్, సీనియర్ ఇంజినీర్ వై.అంకమ్మరావు పాల్గొన్నారు
కొనసాగుతున్న గేట్ల ఏర్పాటు
మరోవైపు ప్రాజెక్టు గేట్ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. స్పిల్ వే పిల్లర్ల నిర్మాణం 55 మీటర్ల ఎత్తుకు చేరుకోవడంతో డిసెంబర్ 18న గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభించారు. ప్రపంచంలోనే పెద్దవైన ఆర్మ్ గడ్డర్లను పోలవరం ప్రాజెక్టు గేట్లకు ఉపయోగిస్తున్నారు. ప్రాజెక్టుకు ఏర్పాటు చేస్తున్న ఒక్కో గేటు బరువు 300 టన్నులు ఉంటుంది. మొత్తం గేట్లకు 18వేల టన్ను స్టీల్ ను వినియోగిస్తున్నారు. ప్రాజెక్టు గేట్లు పైకి ఎత్తడానికి, కిందకి దించడానికి, వరదనీటిని విడుదల చేయడానికి హైడ్రాలిక్ పద్ధతని వినియోగిస్తున్నారు. గేట్ల ఏర్పాటుకు అవసరమైన 98 సిలిండర్లను జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్నారు.
2022 ఖరీఫ్ లక్ష్యం
వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించిన సమయంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికే పనులు అన్నీ సక్రమంగా పూర్తి చేసి 2022 ఖరీఫ్ నాటికి నీళ్లందిస్తామని ప్రాజెక్ట్ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Polavaram