నాలుగున్నరేళ్లుగా ఎటూ తేలని తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన.. ఓ కొలిక్కి వచ్చింది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, గత ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం.. హైకోర్టు విభజనపై తాత్సారం చేసింది. నాలుగున్నరేళ్లుగా ఈ విషయంపై ఎటూ తేల్చకుండా వివిధ కారణాలు చెబుతూ తాత్సారం చేసింది. అయితే, విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో నూతన భవన నిర్మాణం జరిగే వరకు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఉమ్మడి హైకోర్టుభవనంలోనే రెండు న్యాయస్థానాలు సంయుక్తంగా కొనసాగుతాయని అప్పటి యూపీఏ ప్రభుత్వం పేర్కొంది. అయితే నాలుగేళ్లుగా తెలంగాణ న్యాయవాదులు ప్రత్యేక కోర్టు కోసం పోరాటం సాగిస్తున్నారు. వారి తరపున తెలంగాణ ప్రభుత్వం కూడా పలు దఫాలు కేంద్ర న్యాయశాఖామంత్రికి, సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తికి విజ్ఞప్తులు చేసింది. అనేక ఉత్తరాలు రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయమై స్పందించాల్సి ఉందని.. వారి రాష్ట్రంలో హైకోర్టు భవనాన్ని నిర్మించుకుంటేనే ఉమ్మడి హైకోర్టు విభజన సాధ్యమవుతుందని స్పష్టం చేసింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం చాలారోజుల వరకు స్పందించలేదు. దీంతో ఆ విషయం వాయిదాపడుతూ వచ్చింది. అమరావతిలో కొత్త భవనం నిర్మించే వరకు ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించవచ్చని, తాము వేరే భవనంలో హైకోర్టును ఏర్పాటు చేసుకుంటామని తెలంగాణ స్పష్టం చేసినా ఫలితం లేకపోయింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులోనూ పోరాటం చేసింది.
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో హైకోర్టు భవననిర్మాణం చేపట్టడంతో ఉమ్మడి హైకోర్టు విభజన అంశం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఏపీ హైకోర్టు భవన నిర్మాణం పూర్తికానుండడంతో.. అక్కడ న్యాయసేవలు అందించేందుకు రంగం సిద్ధమవుతోంది. అందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నోటిఫికేషన్ విడుదల చేసినట్టు తెలుస్తోంది. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, High Court, Hyderabad, President of India, Ram Nath Kovind, Telangana