ఓ గ్రామ వాలంటీర్ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురి ప్రాణాలను కాపాడాడు. ప్రణాలకు తెగించి మరీ వారిని రక్షించారు. అందులో ఇద్దరు వృద్దులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన గుంటూరు జిల్లా రొంపిచర్లలో చోటుచేసుకుంది. వాలంటీర్ చూపిన ధైర్య సాహసాలను నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అభినందించారు. వివరాలు.. రొంపిచర్లలో పేదలు నివసించే ప్రాంతంలో మొత్తం 12 వరకు పూరి గుడిసెలు ఉన్నాయి. అందులో 4 గుడిసెలు ఒకదానికొకటి ఆనుకుని ఉన్నాయి. అయితే శనివారం ఓ విద్యుత్ వైర్ తెగి పూరి గుడిసెపై పడింది. దీంతో పెద్దఎత్తున మంటలు అంటుకున్నాయి. పక్కన ఉన్న మరో గుడిసెకు కూడా మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో రెండు గుడిసెల్లో ఉన్న ఇద్దరు వృద్దులు, నలుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో భయాందోళన చెందిన వారు కేకలు వేశారు.
అయితే అక్కడికి సమీపంలోనే నివాసం ఉంటున్న గ్రామ వాలంటీర్ శివకృష్ణ వెంటనే అక్కడికి చేరుకున్నాడు. గుడిసెల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలను రక్షించాడు. అలాగే మరో గుడిసెకు తాళం వేసి ఉండగా దానిని తొలగించి అందులోని గ్యాస్ సిలిండర్ను బయటకు తీసుకొచ్చాడు.ఈ క్రమంలోని శివకృష్ణకు కూడా మంటలు అంటుకోవడంతో గాయాలు అయ్యాయి. వాటిని అర్పేసిన స్థానికులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకన్న నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రికి వెళ్లి వాలంటీర్ శివకృష్ణను అభినందించారు. అతని వైద్య ఖర్చులను భరిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బాధితులను కూడా పరామర్శించి సాయం అందించారు. ఇక, ఆరుగురు ప్రాణాలను కాపాడిన శివకృష్ణను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.