ANDHRA PRADESH GRAMA VOLUNTEER DIES 2 DAYS AFTER TAKING COVID VACCINE IN SRIKAKULAM DISTRICT CAUSE OF DEATH UNKNOWN SU
Andhra Pradesh: కోవిడ్ టీకా తీసుకున్న రెండు రోజులకే మృతి చెందిన మహిళా గ్రామ వాలంటీర్.. పోస్ట్‌మార్టమ్ తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయన్న తహసీల్దార్
ప్రతీకాత్మక చిత్రం
కరోనా టీకా తీసుకున్న రెండు రోజులకే ఓ గ్రామ వాలంటీర్ మృతిచెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో చోటుచేసుకుంది.
కరోనా టీకా తీసుకున్న రెండు రోజులకే ఓ గ్రామ వాలంటీర్ మృతిచెందింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో చోటుచేసుకుంది. అయితే ఆమె మృతికి కరోనా వ్యాక్సిన్ కారణమా? లేక ఇతర ఆరోగ్య సమస్యలా? అనేది తెలియాల్సి ఉంది. వివరాలు.. పలాస మండలంలోని రెంటికోట గ్రామానికి చెందిన పిల్లా లలిత(28) గ్రామ వాలంటీర్ చేస్తున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన లలితోపాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అప్పటి నుంచి వీరిలో కొద్దిపాటి జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. అయితే లలితలో మాత్రం లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున లలిత మృతి చెందింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే లలిత మృతిచెందడంపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ వికటించడం వల్లే తమ బిడ్డ మృతి చెందిందని లలిత తల్లిదండ్రులు ఆరోపించారు.
ఇక, ఈ విషయం తెలిసిన అధికారులు లలిత ఇంటికి చేరకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాకే మృతికి గల కారణాలను నిర్ధారించగలమని తహసీల్దార్ చెప్పారు. లలిత మృతిచెందడంతో ఆమెతో పాటు వ్యాక్సిన్ తీసుకున్న మిగతా వలంటీర్లు, వీఆర్వోకు భయంపట్టుకుంది. దీంతో వారు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఇక, లలితకు భర్తతో పాటు ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు
మరోవైపు తమ బిడ్డకు ఎలాంటి సమస్య లేదని లలిత తల్లి చెబుతున్నారు. టీకా వేసుకున్న తర్వాత జ్వరం వచ్చిందని.. మెడికల్ సిబ్బందికి తెలియజేస్తే పారాసిటమాల్ వేసుకోవాలని చెప్పారని తెలిపింది. అయితే లక్షణాలు అలాగే ఉంటాయిలే అనుకుని లలిత ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదని పేర్కొంది. తర్వాత రోజు కూడా జ్వరం తగ్గకపోవడంతో లలిత ట్యాబ్లెట్ వేసుకుందని చెప్పింది. కానీ తెల్లారేసరికే ఇలా జరిగిపోయిందని కన్నీటిపర్యంతం అయింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.