ఆంధ్రప్రదేశ్‌లో ‘నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద పేదలకు ఇచ్చే ఇళ్ల నిర్మాణాన్ని డిసెంబర్ 25న చేపట్టనున్నారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 7 వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. అన్ని నియోజకవర్గాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొంటారు. మొత్తంగా 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అందించనున్నారు. రూ.23,535 కోట్ల విలువైన ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నారు. కోర్టు కేసులు కారణంగా ఇళ్ల స్థలాలు ఇవ్వలేక పోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులుగా ఎంపికైన వారికి, కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లేఖ ఇవ్వాలని నిర్ణయించారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళిక వేసింది. పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25నే 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నారు. 175 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 8,914 ఇళ్లు చొప్పున పనులు ప్రారంభించనున్నారు. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడతారు. టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై సీఎం ప్రకటించిన తాజా రాయితీల ప్రకారం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును ప్రభుత్వం భరించనుంది. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం ఒక రూపాయికే ప్రభుత్వం అందించనుంది.
ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్లు పథకం అమలు కోసం రూ. 935 కోట్లు ఖర్చు చేసేందుకు పాలనానుమతి ఇచ్చింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూమికి పరిహారం చెల్లింపు కోసం రూ. 935 కోట్లు విడుదల చేసింది. సీసీఎల్ఏ ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్లకు భూసేకరణ నిమిత్తం చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. విడుదలైన మొత్తంలో రూ. 88.92 కోట్లు నిర్వహణా వ్యయం కూడా ఉన్నట్టు రెవెన్యూ శాఖ పేర్కొంది.
కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని, న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందు కెళ్లాలని సీఎం చెప్పారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన తర్వాత శరవేగంతో పనులు సాగాలన్నారు. దీని కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
1. లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే ఇళ్లు కట్టించి ఇస్తారు.
2. మెటీరియల్ ఇవ్వండి, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వండి అంటే అది చేస్తారు.
3. డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు ఇస్తాం, ఇళ్లు లబ్ధిదారుడు కట్టుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Housing lands for poor, Navaratnalu