కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (Krishna River Management Board)కు అప్పగించాలని నిర్ణయించింది. కేఆర్ఎంబీ 15వ ప్రత్యేక బోర్డు సమావేశంలో ఈ అప్పగింత నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా జలాల పంపకంలో రెండు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో జూలై 15న హైదరాబాద్‌లో కేఆర్ఎంబీ సమావేశం నిర్వహించింది. అనంతరం తాజాగా కృష్ణాజలాలపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులైన శ్రీశైలం రైట్ బ్యాంక్ పవర్ హౌస్ (Srisailam Right Bank power house), నాగార్జున సాగర్ కుడి కాలువ పవర్ హౌస్ (Nagarjuna Sagar right canal power house) లను కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
విభజన సమయంలో పంపకం..
ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణను 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అదే రాష్ట్ర విభజన సమయంలో శ్రీశైలం వద్ద ఎడమ ఒడ్డున ఉన్న పవర్ హౌస్, నాగార్జున సాగర్ వద్ద ఎడమ కాలువ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు. శ్రీశైలం మరియు నాగార్జున సాగర్‌లోని పవర్ హౌస్‌లను KRMB కి అప్పగించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూనే, తెలంగాణ రాష్ట్రంతో పాటు అధికారికంగా ప్రాజెక్టులను అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించింది.
Andhra Pradesh : విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు వచ్చేది అప్పుడే..
ఎక్కడెక్కడ ప్రాజెక్టులు..
భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ప్రవహిస్తోన్న ఈ నది పొడవులో గంగ బ్రహ్మపుత్ర గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది. దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది మహారాష్ట్ర నుంచి కర్ణాటక అక్కడి నుంచి తెలంగాణ ఆ తరువాత ఆంధ్రాలోకి వస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి ఆ తరువాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది. నదికి ఒకవైపు తెలంగాణ మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి.
ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ తెలంగాణ ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది. కృష్ణానదిపై శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా ఎడమవైపున తెలంగాణ ఉంది.
APPSC Recruitment 2021 : ఏపీపీఎస్సీలో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు.. పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం
వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది. ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.
అసలు ఎందుకీ వివాదం..
2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండగా నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండగా నీటి వాటా 64 శాతం వచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే. ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి ముందు చెప్పుకున్నట్టు కృష్ణా డెల్టా తన హక్కు ఉపయోగించడం దిగువన ఉండడం వంటివి కారణాలు.. సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా పరోక్షంగా రాయలసీమకు మేలు. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Krishna River, Krishna River Management Board, Nagarjuna sagar dam, Srisailam Project, Telangana