ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. EBC/BC/SC లబ్దిదారులకు ఆదాయ స్థితిని పెంచడానికి, నికర, నిరంతర స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ఫోర్ వీలర్ మినీ ట్రక్కు (సరకు బట్వాడా యూనిట్) లను అందించాలని నిర్ణయించింది. ట్రక్కులను 60% సబ్సిడీతో అందజేయడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం జీవో 69 జారీ చేసింది. ఆ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే ఉండే నిబంధనలు ఇవే.
లబ్ధిదారుల ఎంపికకు అర్హతా ప్రమాణాలు :
1. దరఖాస్తుదారు కుటుంబ ఆదాయం నెలకు రూ. 10,000 మించరాదు.
2. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి / పెన్షనర్ ఉండకూడదు
3. కుటుంబం లో నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండరాదు
4. కుటుంబ సభ్యులు ఎవరూ ఆదాయపు పన్ను చెల్లింపు దారులై ఉండరాదు.
5. అభ్యర్ధి స్థానికుడై ఉండవలెను.6.అభ్యర్ధి వయస్సు 21-45 సంవత్సరాలు అయి ఉండవలెను.
7. కనీస విద్యార్హత 7వ తరగతి పాస్ అయి ఉండవలెను.
8.LMV డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను.
9. గతంలో వాహన ఋణం తీసుకొని, బ్యాంకుకు డీఫాల్టర్ అయి ఉండరాదు.
10. స్థానికత ధ్రువ పత్రము (ఆధార్, రైస్ కార్డు లేదా తాసీల్దార్ ధ్రువీకరణ)
11. కుల ధ్రువీకరణ పత్రం (ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్) కలిగి ఉండాలి.
పథకాన్ని ఎలా అందిస్తారు?
లబ్ధిదారుని వాటా (10 శాతం) - రూ 58,119
బ్యాంకు లోన్ (30 శాతం) - రూ 1,74,357
ప్రభుత్వ సబ్సిడీ (60 శాతం) - రూ 3,48,714
ఎంపిక ప్రక్రియ
మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షులుగా (బ్యాంకుమేనేజర్, ITDA ప్రతినిధి, రవాణాశాఖ ప్రతినిధి సభ్యులు) గల స్క్రీనింగ్, ఎంపిక కమిటీ అభ్యర్థులను ఎంపిక చేసింది. అర్హత కలిగిని వారిని ఇంటర్వ్యూ చేసి కనీస విద్యార్హత, ఆపై విద్యార్హత ఉన్నచో 10 మార్కులు, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నచో 10 మార్కులు, వాహనములు, రవాణాలపై సాధారణ అవగాహనకు, జనరల్ ఆప్టిట్యూడ్(యోగ్యత, సామర్ధ్యము) లకు 30 మార్కులు వెరసి 50 మార్కులకు గాను ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారి జాబితాను కుదించి మెరిట్ ప్రాతిపదికన జాబితా తయారు చేస్తారు. దాన్ని ITDA ప్రాజెక్టు అధికారికి పంపిస్తారు. ఉన్నతాధికారుల నుంచి మంజూరు అయినట్టు లిస్టు వస్తుంది. ఆ జాబితా ఎం.పీ.డీ.ఓ., తాసీల్దార్, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ అదనపు లబ్ది
లబ్ధిదారుడు నికరంగా నెలసరి ఆదాయం పొందటానికి ఆంధ్ర ప్రదేశ్ పౌర సరఫరాల శాఖ 6 సంవత్సరాల పాటు పరస్పర అంగీకారంతో పని కల్పిస్తారు.
సమయ ప్రణాళిక
నోటిఫికేషన్ తేదీ - 20.11.2020
దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ - 27.11.2020
ఇంటర్వ్యూ, లబ్ధిదారుల ఎంపిక తేదీ - 04.12.2020
లబ్ధిదారుల ఎంపిక జాబితా ప్రకటన తేదీ - 05.12.2020
ఆశక్తిగల వారు గ్రామ సచివాలయంలో సదరు దరఖాస్తును వెల్ఫేర్, విద్యా సహాయకునికి అన్ని ధ్రువపత్రాలను జతపర్చి అందజేయాలి.