Governor on New Districts: ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే 26 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. వాటి పేర్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 జిల్లాలతో కలిపి 26 జిల్లాలు కానున్నాయి. 1974 ఏపీ జిల్లాల చట్టం ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. చట్టానికి అనుగుణంగా కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై సీసీఎల్ఏ ప్రాథమిక నోటిఫికేషన్ రూపొందించింది. సూచనలు, సలహాల కోసం 30 రోజుల గడువు ఇచ్చారు. నిపుణుల సలహాలు, న్యాయపరంగా ఇబ్బందులు అన్నింటినీ బేరీజు వేసుకున్న తరువాత వాటిని పరిశీలించి అవసరమైతే మార్పులు, చేర్పులు చేస్తారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అందులోనే కొత్త జిల్లాలు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో తెలుపుతూ అపాయింటెడ్ తేదీని పేర్కొంటారు. ఆ తేదీ నుంచి కొత్త జిల్లాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియనంతటినీ ఉగాదిలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా గవర్నర్ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఇవాళ ఏపీ వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగాయి. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రభుత్వం తరఫున గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్రాజు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జాతీయ పతాక ఆవిష్కరణ తరువాత మాట్లాడిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మనబడి నాడు-నేడు కింద కొత్తగా స్కూళ్లు, కాలేజీలు అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని కొనియాడారు. పేద విద్యార్థులకు బాసటగా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్నారని.. జగనన్న విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద పథకాల ద్వారా విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుతోందని గవర్నర్ పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తోందని గవర్నర్ ప్రసంగించారు.
కొత్త జిల్లాలపైనా గవర్నర్ హరిచందన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 13 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని.. ఇందులో గిరిజనుల కోసం రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తుండటం అభినందనీయమన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని.. అప్పటి నుంచి కొత్త జిల్లాలలో పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచిందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.