ANDHRA PRADESH GOVERNOR BISWA BHUSHAN HARICHANDAN HINTS ABOUT 3 CAPITALS WILL START SOON PRN
Andhra Pradesh: మూడు రాజధానులకు ముహూర్తం పెట్టేశారా..? గవర్నర్ ప్రసంగంలో ఆంతర్యమేంటి..?
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మూడు రాజధానులకు ( 3 Capitals) ముహూర్తం పెట్టేసిందా..? త్వరలో విశాఖపట్నంకు (Visakhapatnam) పరిపాలన రాజధాని తరలింపు ఖాయమా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానులకు ముహూర్తం పెట్టేసిందా..? త్వరలో విశాఖపట్నానికి రాజధాని తరలింపు ఖాయమా..? గణతంత్రదినోత్సవం సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగంలో భాగంగా మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం కోసం మూడు రాజధానుల ఏర్పాటు జరుగుతోందని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ గతంలో ఇబ్బందులు సృష్టించిందన్న గనర్నర్.., ప్రభుత్వం వికేంద్రీకరణపైనే ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. ప్రాంతీయ సమానాతల కోసం మూడు రాజధానుల అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి విశాఖను పరిపాలనా రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అన్ని రంగాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.
ప్రస్తుతం గవర్నర్ ప్రసంగం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మూడు రాజధానులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. మార్చిలోనే దీనికి ముహూర్తం పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగానే అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తోంది. సీఆర్డీఏ రద్దు, పరిపాలన వికేంద్రీకరణ చట్టాలపై స్టే ఉన్నా.. ప్రభుత్వం మాత్రం చాప కింద నీరులా పనులు చేసుకుంటూ వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైజాగ్ లో ప్రభుత్వం గెస్ట్ హౌస్ ను నిర్మించేందుకు ఏర్పాటు చేస్తోంది. మరోవైపు రిషికొండ ప్రాంతంలో ఉన్నతాధికారులు నివాసముండేందుకు రిసార్టులను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు సంబంధించిన భవనాలను కూడా అన్వేషిస్తున్నారు. ప్రభుత్వంలో దాదాపు అన్ని శాఖలు ఇప్పటికిప్పుడు కార్యాలయాలు తరలించినా సమస్య రాకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుకు విశాఖ ద్వారకా బస్ స్టేషన్ పై అదనపు అంతస్తులు నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు విశాఖను కేంద్రంగా చేయడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే జపాన్, అమెరికా సంస్థలు విశాఖలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఇటీవల ఉత్తరాంధ్రకు పెట్టుబడులు తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేక సదస్సులు నిర్వహించింది.
మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డుగా ఉన్న న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని సీఎం వైఎస్ జగన్ తో సహా వైసీపీ ముఖ్యనేతలంతా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈనేపథ్యంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి ప్రభుత్వం ఆశిస్తున్న విధంగా న్యాయచిక్కులు వీడుతాయా..? సీఎం జగన్ తాను అనుకున్నది సాధిస్తారా..? అనేది వేచి చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.