జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్తా చాటింది. స్థానిక సంస్థలకు అధికారాలు ఇచ్చిన 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన సంద్రభంగా ఏప్రిల్ 24న, జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా కేంద్రం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబర్చిన పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నాలుగు కేటగిరీలలో కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేసింది. గత ఏడాది (2020)లో రాష్ట్రానికి 15 అవార్డులు రాగా, ఈసారి మొత్తం 17 అవార్డులను సొంతం చేసుకుంది. e-పంచాయత్ కేటగిరీలో రాష్ట్రస్థాయి రెండో అవార్డుతో పాటు, జిల్లా స్థాయిలో 2, మండల స్థాయిలో 4, పంచాయతీ స్థాయిలో 10 జాతీయ అవార్డులు ఈ ఏడాది (2021) రాష్ట్రానికి దక్కాయి. దేశ వ్యాప్తంగా ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌తో పాటు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
వర్చువల్ విధానంలో అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ, ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్ నొక్కి, అవార్డులు పొందిన పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఖాతాల్లో నగదు బహుమతి జమ చేశారు. అలాగే 7 రాష్ట్రాలలోని 5 వేల గ్రామాలలో ప్రాపర్టీ కార్డుల జారీని కూడా ప్రధాని ప్రారంభించారు.అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ, కోవిడ్ కష్టకాలంలోనూ గ్రామ పంచాయతీలు గత ఏడాది నుంచి చాలా చక్కగా పని చేస్తున్నాయని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నందున, పంచాయతీలు అదే స్ఫూర్తితో పని చేయాలని, కోవిడ్ మహమ్మారికి సమర్థంగా ఎదుర్కోవడం గ్రామ పంచాయతీలలోనే ఆరంభం కావాలని ఆకాంక్షించారు.
అవార్డులు ప్రదానం చేసిన సీఎం
అనంతరం సీఎం జగన్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించిన జాతీయ స్థాయి అవార్డులను ప్రదానం చేశారు. e-పంచాయత్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ పొందిన రాష్ట్రస్థాయి రెండో అవార్డును పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది కమిషనర్ ఎం.గిరిజాశంకర్‌కు ప్రదానం చేసిన సీఎం జగన్, ఆ తర్వాత జిల్లా, మండల, పంచాయతీల అవార్డులు ఇచ్చారు. అలాగే జిల్లా స్థాయిలో గుంటూరు జిల్లా సాధించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాన్ని గుంటూరు జడ్పీ సీఈఓ డి.చైతన్యకు, కృష్ణా జిల్లా సాధించిన అవార్డును జడ్పీ సీఈఓ పీఎస్ సూర్యప్రకాశరావుకు అందజేశారు.
మండల స్థాయిలో చిత్తూరు జిల్లా సొడెం, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్, కృష్ణా జిల్లా విజయవాడ రూరల్, అనంతపురం జిల్లా పెనుకొండ ఎంపీడీలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాలు సాధించాయి. గ్రామ పంచాయతీల స్థాయిలో కర్నూలు జిల్లా వర్కూరు, విశాఖపట్నం జిల్లా పెదలబూడు, గుంటూరు జిల్లా గుల్లపల్లి, నెల్లూరు జిల్లా తడ కండ్రిగ, అదే జిల్లాకు చెందిన తాళ్లపాలెం, పార్థవెల్లంటి, పెన్నబర్తి, చిత్తూరు జిల్లా రేణిమాకులపల్లి, తూర్పు గోదావరి జిల్లా జి.రంగంపేట పంచాయతీలకు అవార్డులు దక్కాయి. కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ ఎం.గిరిజాశంకర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Peddireddy Ramachandra Reddy, PM Narendra Modi