Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచీ తరలించేందుకు వీలయ్యే అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. విశాఖ కేంద్రంగా, అక్కడే పరిపాలన సాగించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. అందులో భాగంగా... అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మించాలని గత ప్రభుత్వం అనుకున్న గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌ను విశాఖపట్నానికి తరలించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు ఓ ప్రధాన కారణాన్ని ప్రభుత్వం చెబుతోంది. ఏంటంటే... అమరావతిలో కేటాయించిన భూములకు అటవీ శాఖ రెండో దశ అనుమతులు రాలేదనీ... అందువల్ల విశాఖలో ప్రత్యామ్నాయ భూముల్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్... రాజ్యసభలో తెలిపారు. ఈ క్రమంలో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌కి విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం... జగన్నాథపురంలో 350 నుంచీ 400 ఎకరాలు కేటాయించడానికి ఆ జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉన్నట్లు ప్రతిపాదనలు పంపినట్లు నిత్యానందరాయ్ తెలిపారు. అసలు ఈ చర్చంతా జరగడానికి కారణం రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. ఆయనే లిఖితపూర్వకంగా గ్రేహౌండ్స్ ఏర్పాటు సంగతేంటని అడిగితే... దానిపై సమాధానంగా ఈ ఆన్సర్ ఇచ్చారు. దాంతో అమరావతి నుంచీ గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్ విశాఖకు తరలిపోతోందన్న వాస్తవం బయటపడింది.
ఇప్పటికే 50 రోజులకు పైగా రాజధాని అమరావతిలో రైతులు... రాజధానిని తరలించవద్దని పదే పదే కోరుతున్నారు. ర్యాలీలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఎన్ని చేస్తున్నా, ఏం చేస్తున్నా ప్రభుత్వం తాము అనుకున్న ప్రకారం చేసుకుపోతోంది. టీడీపీ లాంటి ప్రతిపక్ష పార్టీలు అమరావతి రైతుల్ని పక్కదారి పట్టిస్తున్నాయనీ, తాము రాజధానిని విశాఖ, అమరావతి, కర్నూలులో మూడు చోట్ల అభివృద్ధి చేస్తామని అంటోంది. అందులో భాగంగానే ఇటీవల కర్నూలుకు రెండు కీలక విభాగాల్ని తరలించింది. మరిన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
శాసన మండలిలో రాజధాని వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు ఆమోదం పొందకుండా అవి సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ చెప్పడంతో... అక్కడ ప్రభుత్వ స్పీడ్‌కి బ్రేక్ పడినట్లైంది. ఐతే... ఇదేమంత పెద్ద సమస్య కాదనీ... నాలుగు నెలల్లో రెండు బిల్లుల్నీ ప్రభుత్వం ఆమోదింపజేసుకోవడానికి వీలవుతుందని రాజ్యాంగ విశ్లేషకులు అంటున్నారు. అందువల్ల ఆలోగా... ప్రభుత్వం అమరావతి నుంచీ వీలైనంతవరకూ విశాఖకు తరలించే అంశాల్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amaravati, Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Visakhapatnam, Ys jagan