ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల రాజకీయం జోరుగా నడుస్తోంది. మీ హయంలోనే దేవాలయాలు కూల్చారంటూ తెలుగుదేశం పార్టీని అధికార వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంటే.. కాదు మీరే దాడులు చేస్తున్నారని ప్రతిపక్షం.. అధికార పక్షానికి కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ షాకిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. 2016 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో తెలుగుదేశం ప్రభుత్వం కూల్చిన ఆలయాలను పునర్నర్మిచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతంది. విజయవాడలోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డు బొమ్మ, గోశాల కృష్ణుడి దేవాలయాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేయన్నారు. ఎల్లుండి అంటే ఈనెల 8వ తేదీన ఉదయం 11.01 నిమిషాలకు జగన్ శంకుస్థాపన చేయనున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. అలాగే రూ.70కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టనున్నారు.
ఇటీవల హిందూ ఆలయలపై జరుగుతున్న దాడులకు వైసీపీ ప్రభుత్వమే కారణమని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో.. టీడీపీ హయాంలో కూల్చిన ఆలయాలకు శంకుస్థాపన చేయడం ద్వారా ప్రతిపక్షానికి బుద్ధి చెప్పడంతో పాటు ప్రజల్లో నమ్మకం కలిగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. మరోవైపు చాలా రోజులుగా ఆలయాల పునర్నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచిస్తూనే ఉంది. తాజా వివాదాల నేపథ్యంలో శంకుస్థాపనకు ఇదే సరైనా సమయంగా భావించింది. ఒక్క విజయవాడలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 40 ఆలయాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
పుష్కరాల సమయంలో పురాతన ఆలయాలు నేలమట్టం
2016లోర కృష్ణాపుష్కరాల సమయంలో దేవాలయాలను కూల్చుతూ టీడీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అభివృద్ధి పనులు, రోడ్ల విస్తరణ, టాయిలెట్ల ఏర్పాటు, ఘాట్ల నిర్మాణం పేరుతో దాదాపు 42 హిందూ ఆలయాలను అప్పటి టీడీపీ ప్రభుత్వం కూల్చి వేసింది. వీటిలో చిన్న చిన్న ఆలయాలతో పాటు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 4వ శతాబ్దం నాటి వీరభద్రస్వామి ఆలయం కూల్చివేశారు. వీరభద్రస్వామిని విజయవాడ క్షేత్ర పాలకుడుగా భక్తులు భావిస్తారు. వన్‌టౌన్ లోని వినాయక ఆలయం, సీతమ్మ వారి పాదాల దగ్గర ఉన్న ప్రముఖ శనీశ్వర ఆలయం కూడా కూల్చివేతకు గురైంది. ఇక్కడి ప్రత్యేక శనైచ్ఛరస్వామి ఆలయం దేశంలోనే ప్రత్యేకత పొందింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అతి పురాతనమైన, ప్రసిద్ధ పాతాళ వినాయకుని ఆలయం, బస్‌స్టాండ్ ఎదురుగా ఉన్న ప్రసిద్ధ షిరిడి సాయి ఆలయం, కృష్ణలంక ఆంజనేయ స్వామి ఆలయం, కృష్ణలంకలోని శంకరమఠం, శివాఆలయం, రాహుకేతు ఆలయాలు నేలమట్టం చేశారు. వన్‌టౌన్లోని భవానీ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయంతోపాటు రోడ్డుకు అడ్డంగా లేకపొయినా గోశాలలు తొలగించారు. భవానీపురంలో స్వయంభు అమ్మవారి ఆలయం నామరూపాలు లేకుండా పోయింది. చివరికి దుర్గ గుడిపై భవాని మండపాన్ని కూడా తొలగించారు.
అప్పట్లో ఈ వ్యవహారంపై టీడీపీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ ఆందోళనలకు దిగినా పట్టించుకోలేదు. కనీసం ఆలయాలకు శంకుస్థాపనలు కూడా చేయలేదు. అప్పటి టీడీపీ నిర్లక్ష్యం ఇప్పుడు వైసీపీకి ఆయుధంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap cm ys jagan mohan reddy, Hindu Temples, Vellampalli srinivas