YSR Free Crop Insurance Scheme: ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే చాలా పథకాలు అమలు చేసింది. తాజాగా మరొకటి ఇవాళ ప్రారంభిస్తోంది. అదే వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకం. దీని వల్ల ఏపీలో 9.48 లక్షల రైతులకు దాదాపు రూ.1252 కోట్ల బీమా పరిహారం అందనుంది. ఇదంతా 2019 సీజన్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా ఇస్తున్నారు. ఇవాళ సీఎం జగన్ తన క్యాంప్ ఆఫీస్‌లో కంప్యూటర్లో బటన్ నొక్కగానే... పరిహార డబ్బు... బాధిత రైతుల అకౌంట్లలోకి డైరెక్టుగా జమ అవుతుంది. ఆ తర్వాత రైతులకు డబ్బు జమ (credit) అయినట్లుగా వారి మొబైల్స్‌కి మెసేజ్ వస్తుంది. మెసేజ్ రాగానే వారు ఏటీఎం లేదా బ్యాంకుకు వెళ్లి... డబ్బు తీసుకోవచ్చు.
పక్కాగా బీమా వసూళ్లు:
2019 సీజన్లో రకరకాల కారణాలతో రైతులు పంటలు నష్టపోయారు. వారంతా తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మొత్తం 9.48 లక్షల మంది రైతులు బాధితులు అయ్యారు. వారు ఎంత పంట నష్టపోయారో ప్రభుత్వ అధికారులు అంచనాలు వేశారు. మొత్తం రూ.1252 కోట్లు నష్టపోయినట్లు అంచనా వచ్చింది. ఆ డబ్బును ఇవాళ ఇస్తున్నారు. 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకి సంబంధించి అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.122.61 కోట్లను చెల్లించిన ఇప్పటి వైసీపీ ప్రభుత్వం, ఆ డబ్బును ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తిరిగి రాబట్టింది. అందులో భాగంగా ఈ సంవత్సరం జూన్ 26న, ఇన్సూరెన్స్ కంపెనీలు రాష్ట్రంలోని 5.94 లక్షల రైతులకు రూ.596.36 కోట్లు ఇచ్చాయి.
ప్రభుత్వానిదే బాధ్యత:
పంటలు వెయ్యడమే కష్టమనుకునే రైతులు... వాటికి బీమా తీసుకొని, ప్రీమియం చెల్లించడం భారమైన పని. అందుకే ఏపీ ప్రభుత్వమే... ప్రతి ఎకరాన్నీ ఈ-క్రాప్‌లో నమోదు చేయిస్తోంది. ఆ ఎకరాలకు బీమా తీసుకొని... ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తోంది. ఆ పథకమే వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం. ఇది దేశంలో మరెక్కడా లేదు. ఇందులో ఏమాత్రం అవినీతి లేకుండా ప్రభుత్వం అర్హులైన రైతులకే ప్రీమియం చెల్లిస్తోంది. అలాగే పరిహారం కూడా రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా వెయ్యడం వల్ల మధ్యవర్తుల అవినీతి లేకుండా పోయింది.
వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం వల్ల రైతులు ధైర్యంగా రకరకాల పంటలు వెయ్యగలుగుతున్నారు. సంప్రదాయ పంటలతో పాటూ సరికొత్త ప్రయోగాత్మక పంటలు కూడా వేస్తున్నారు. అందువల్ల వరి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో రకాల పంటల ఉత్పత్తులను దేశానికి ఇచ్చేందుకు వీలవుతోంది. దానికి తోడు ఇలా పరిహారం చెల్లిస్తుండటంతో రైతులు తిరిగి ఆ డబ్బుతో తమకు నెక్ట్స్ వేసే పంటలకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు కొనుక్కునేందుకు వీలవుతోంది. ప్రతిసారీ ప్రకృతి వైపరీత్యాలతో కన్నీరు పెట్టే రైతులు ఈ వైఎస్ఆర్ ఉచిత బీమా పథకం వల్ల కష్టాల నుంచి గట్టెక్కుతున్నారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.