ANDHRA PRADESH GOVERNMENT TO IMPLEMENT 3RD PHASE OF YSR RAITHU BHAROSA PRN
YSR Raithu Bharosa: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్... రేపే ఖాతాల్లోకి నగదు..!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. లక్షలాది మంది రైతుల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ (YS Jaganmohan Reddy) నగదు జమ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. నవరత్నాలు అమలులో భాగంగా వరసగా రెండో ఏడాది రైతులకు పెట్టుబడి సహాయం చేస్తోంది. ‘వైయస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో మూడో విడత నగదు జమచేయనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీతో పాటు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం అందజేయనుంది. మరోవైపు ఆర్ఓఎఫ్ఆర్ కింద పట్టాలందుకున్న గిరజనులకు కూడా రైతు భరోసా కింద సాయం అందించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 చొప్పున పెట్టుబడి జమ చేసిన ప్రభుత్వం.. మూడో విడతలో భాగంగా రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
ఇక తొలిసారిగా ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించనున్నారు. అలాగే నివర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం సాయం అందజేయనుంది. ఇన్ పుట్ సబ్సిడీకి సంబంధించి 8.34 లక్షల మంది రైతులకు రూ.646 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం చేస్తోంది. ఇలా రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.1,766 కోట్లు జమ చేయనుంది.
రైతు భరోసా పథకం కింద ఏటా రైతులకు పెట్టుబడి సహాయంగా ఇస్తున్న రూ.13,500ను వరసగా రెండో ఏడాది కూడా ప్రభుత్వం పక్కాగా అమలు చేస్తోంది. తొలి విడతగా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో అంటే ఈ ఏడాది మే 15న సాయం అందించగా.. అక్టోబర్ 27న రెండో విడత సాయం జమ చేసింది. మూడో విడతగా రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో వేయనున్నారు. రాష్ట్రంలో 51.59 లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో మొత్తం రూ.1,120 కోట్లు జమ చేయనున్నారు.
ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం బ్యాంకులు బాకీల కింద జమ చేసుకోకుండా, రైతుల అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అదే విధంగా రైతులకు ఏ సమస్య వచ్చినా సంప్రదించేందుకు 155251 హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. కౌలు రైతులు, ‘అటవీ హక్కు పత్రాలు’ (RoFR) పొంది భూమి సాగు చేసుకుంటున్న గిరిజన రైతులతో పాటు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పథకం వర్తింప చేశారు.
ఇక అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, వరదల నష్టపోయిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.83 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు నష్టపోయిన 1.67 లక్షల రైతులకు రూ.108.99 కోట్లు అలాగే 33,384 ఎకరాల్లో ఉద్యాన పంటలు నష్టపోయిన 31 వేల మంది రైతులకు రూ.23.64 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఇప్పటికే చెల్లించింది. గత నెలలో వచ్చిన నివర్ తుఫాన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 12.01లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. పంటలు నష్టపోయిన 8.34 లక్షల మంది రైతులకు రూ.645.99 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం జమ చేస్తోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.