ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పదో తరగతి పరీక్ష ఫలితాలు (AP SSC Results 2022) వెలువడిన తర్వాత అందరూ ఖంగుతిన్నారు. అత్యల్ప ఉత్తీర్ణతా శాతం రావడంతో రాజకీయ పరంగా కూడా తీవ్ర దుమారమే రేగింది. రాష్ట్రం మొత్తం మీద 6.22 లక్షల మంది రాసిన పరీక్షల్లో కేవలం 67.27 శాతం ఉత్తీర్ణతే నమోదైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2002 పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ఆ తర్వాత ఇప్పుడే ఇంత తక్కువ ఉత్తీర్ణత రావడం. కరోనా నేపథ్యంలో చివరి రెండేళ్లు పరీక్షలు నిర్వహించకుండా ఆల్ పాస్ విధానంలో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ ఏడాది పరీక్షలు నిర్వహించగా కేవలం 67.27 శాతం మందే ఉత్తీర్ణత సాధించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి పరీక్షలు కూడా ఇవే కావడం విశేషం.
అమ్మ ఒడి (Ammavodi Scheme), నాడు-నేడు పథకాలతో ప్రభుత్వ విద్యను కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రయత్నిస్తుండగా.. ఇప్పుడొచ్చిన ఫలితాలు పూర్తి నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి జూలైలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 13 నుంచి ప్రతి రోజు ఉదయం 9:30 గంటల నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిణకు రూపకల్పన చేశారు. ఏఏ పాఠశాలలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు.. ఏ సబ్జెక్టుల్లో పాస్ మార్కులు రాలేదో తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సంప్లిమెంటరీ కాకుండా.. రెగ్యులర్ పాస్‌గానే ఈసారి ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కసరత్తులు మొదలుపెట్టారు. ప్రత్యేక తరగతులతో జూలైలో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆదేశాలు కూడా జారీ చేశారు.
ఇది చదవండి: నూనూగు మీసాల మెగాస్టార్.. ఒంగోలులో ఆయన స్టయిలే వేరు.. వైరల్‌గా చిరంజీవి ఓల్డ్ పిక్స్
ఇదిలా ఉంటే టెన్త్ రిజల్ట్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ రాసిన విద్యార్థులను కూడా రెగ్యులర్ గా పాసైన విద్యార్థులతో సమానంగా పరిగణిస్తామని ప్రకటించింది. దీంతో విద్యార్థులకు కాస్త ఊరటదక్కినట్లయింది. ఇప్పటికే సప్లిమెంటరీకి సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరిస్తోంది. దాదాపు నెలరోజుల పాటు శిక్షణ ఇచ్చిన తర్వాత పరీక్షలు నిర్వహించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP ssc results