ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ వినియోగదారుల (Electricity Connections) పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో విద్యుత్ చౌర్యం, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్టవేయాలని నిర్ణయించింది. మంగళవారం ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) సమీక్ష నిర్వహించారు. విద్యుత్ చౌర్యం, ఇతర అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ వింగ్ నిత్యం అప్రమత్తంగా ఉంటూ చౌర్యాన్ని అరికట్టాలని ఆయన సూచించారు. అలా ఉంటేనే అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, పర్మిషన్ లేని ఓవర్ లోడ్ వినియోగం, మీటర్ల ట్యాంపరింగ్ వంటి అక్రమాలను అరికట్టవచ్చన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఇండస్ట్రియల్ కనెక్షన్స్ పైనా దృష్టి పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఇంటిని తనిఖీ చేయాలన్న మంత్రి.. విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను మరింత తగ్గించాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇక వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంపైనా మంత్రి స్పందించారు. ఈ విషయంలో రైతులను ప్రతిపక్ష టీడీపీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రాష్ట్రంలోని 18 లక్షల విద్యుత్ కనెక్షన్లలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారనేది తెలుసుకునేందుకే మీటర్లు బిగిస్తున్నాం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 31 వేల 140 విద్యుత్ సర్వసులను తనిఖీ చేసి అక్రమాలు గుర్తించామని.. వాటిపై మొత్తం రూ.131 కోట్ల జరిమానా విధించామన్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఏపీలో విద్యుత్ సంక్షోభం తీవ్రమైన సంగతి తెలిసిందే. వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కొరత అధికమవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక కోతలు విధించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు సాధ్యం కాకపోవడంతో పరిశ్రమలకు పవర్ హాలిడే విధించింది. ఇటీవల అసానీ తుఫాన్ నేపథ్యంలో వాతావరణ చల్లబడటంతో కొన్నిరోజులు విద్యుత్ వినియోగం తగ్గింది. దీంతో పవర్ హాలిడే నిబంధనలను సడలించారు. ఐతే విద్యుత్ కోతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పట్టణాల్లో ఎలా ఉన్నా పల్లెల్లో మాత్రం కోతలు కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం విద్యుత్ ఆదా చర్యలకు ఉపక్రమించింది. ఏసీల వినియోగాన్ని తగ్గించడంతో పాటు పలు సూచనలు పాయించాలని ప్రజలకు సూచించింది. ఐతే ఇప్పుడు అనధికారిక కనెక్షన్లు, మీటర్ల ట్యాంపరింగ్, ఓవర్ లోడ్ వంటివాటిపై దృష్టిపెట్టి జరిమానాలు విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా మంత్రి ఇచ్చిన ఆదేశాలతో ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి చెక్ చేసే అవకాశముంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వు.. ఇప్పుడు తనీఖీలు చేసి ఓవర్ లోడ్, ఇతర ఫిర్యాదుల పేరుతో జరిమానాలు వసూలు చేయడంపై ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Peddireddy Ramachandra Reddy