ఏపీలో కొత్త జిల్లాలపై కొన్ని నెలల క్రితమే ఓ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. డిసెంబర్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఏపీలో కొత్త జిల్లాలు వచ్చే ఏడాది ఏర్పాటవుతాయని విషయంలో స్పష్టత వచ్చింది. అయితే వచ్చే ఏడాది ఎప్పుడు దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందనే అంశంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి 26న స్పష్టమైన ప్రకటన ఉంటుందని స్పీకర్ కోన రఘుపతి అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేయాలని భావించినా.. అరకు నియోజకవర్గంలో సంక్లిష్టత ఏర్పడిందని ఆయన తెలిపారు. దీంతో మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు అవుతాయని అన్నారు.
ఏపీలో అధికారంలోకి రావడానికి ముందే వైఎస్ జగన్ జిల్లాల పునర్విభజన అంశంపై స్పష్టమైన వైఖరిలో ఉన్నారని గతంలో వార్తలు వినిపించాయి. అధికారం చేపట్టిన ఏడాది తరువాత దీనిపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన చేపట్టి మొత్తం 25 జిల్లాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంది. జిల్లాల పునర్విభజనపై కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఇందులో సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ సభ్యలుగా కొనసాగుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వనరులు, తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతో పాటు జిల్లాల సరిహద్దులు, జిల్లాలో వనరుల సమతూకం సహా ఇతర అంశాలపై కమిటీ చర్చించనుంది. ఈ కమిటీ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒక్కో లోక్ సభ నియోజకవర్గం ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీ ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వం సూచించిన విధంగానే కమిటీ నివేదిక రూపొందిస్తే... ఏపీలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కావడం దాదాపు ఖాయమే. అయితే ఏపీలోని ఆ ఒక్క లోక్ సభ నియోజకవర్గం విషయంలో మాత్రం జగన్ సర్కార్ రెండో ఆలోచన చేస్తోందనే వాదన వినిపిస్తోంది. అదే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గం.
విస్తీర్ణం పరంగా అది పెద్ద లోక్ సభ నియోజకవర్గంగా గుర్తింపు తెచ్చుకున్న అరకు పార్లమెంట్ స్థానం మొత్తం నాలుగు జిల్లాల్లో విస్తరించింది. నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో ఉండగా, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. ఇలా ఒక లోక్ సభ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉండటం... అందులోనూ ఈ నియోజకవర్గంలో గిరిజన జనాభా ఎక్కువ ఉండటంతో అరకు జిల్లా ఏర్పాటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
అయితే అరకు జిల్లా అంశంపై కేబినెట్లోనే కొందరు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారని తెలుస్తోంది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణంపై చర్చ జరగ్గా... అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం జగన్ అధ్యయన కమిటీకి సూచించారని తెలుస్తోంది. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలని ఆయన చెప్పినట్టు సమాచారం. దీంతో మిగతా జిల్లాల ఏర్పాటు సంగతి ఎలా ఉన్నా... అరకు విషయంలో మాత్రం ప్రభుత్వం కాస్త భిన్నమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts