ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొంత కాలంగా విద్యుత్ సంక్షోభం (Power Crisis) నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం పరిశ్రమలకు పవర్ హాలిడే (AP Power Holiday) ప్రకటిచింది. తాజాగా రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిచింది. ఈనెల 16 నుంచి పవర్ హాలిడే నిబంధనలు పూర్తిగా ఎత్తివేసినట్లు తెలిపింది. బొగ్గు కొరత వల్ల విద్యుత్ పంపిణీలో సమస్యలు తలెత్తడంతో పవర్ హాలిడే విధించామని.. ఇప్పుడు సమస్య తీరడంతో విద్యుత్ సరఫరాకు ఢోకా లేదని పేర్కొంది. బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తొలగిపోవడంతో ఇకపై ఇబ్బందులు తలెత్తవని ప్రభుత్వం స్పష్టం చేసింది. వేసవి ప్రారంభంలోనే విద్యుత్ కొరత అధికమవడంతో రాష్ట్రవ్యాప్తంగా అనధికారిక కోతలు విధించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లోనూ విద్యుత్ కొనుగోలు సాధ్యం కాకపోవడంతో పరిశ్రమలకు పవర్ హాలిడే విధించింది. ఇటీవల అసానీ తుఫాన్ నేపథ్యంలో వాతావరణ చల్లబడటంతో కొన్నిరోజులు విద్యుత్ వినియోగం తగ్గింది. దీంతో పవర్ హాలిడే నిబంధనలను సడలించారు. ఐతే విద్యుత్ కోతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఏపీలో విద్యుత్ వినియోగదారుల పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో విద్యుత్ చౌర్యం, అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్టవేయాలని నిర్ణయించింది. మంగళవారం ట్రాన్స్ కో విజిలెన్స్ అధికారులతో విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Rama Chandra Reddy) సమీక్ష నిర్వహించారు. విద్యుత్ చౌర్యం, ఇతర అక్రమాలను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్ వింగ్ నిత్యం అప్రమత్తంగా ఉంటూ చౌర్యాన్ని అరికట్టాలని ఆయన సూచించారు. అలా ఉంటేనే అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, పర్మిషన్ లేని ఓవర్ లోడ్ వినియోగం, మీటర్ల ట్యాంపరింగ్ వంటి అక్రమాలను అరికట్టవచ్చన్నారు. గృహ వినియోగదారులతో పాటు ఇండస్ట్రియల్ కనెక్షన్స్ పైనా దృష్టి పెట్టాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రతి ఇంటిని తనిఖీ చేయాలన్న మంత్రి.. విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను మరింత తగ్గించాల్సిన అవసరముందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఇక వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంపైనా మంత్రి స్పందించారు. ఈ విషయంలో రైతులను ప్రతిపక్ష టీడీపీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. రాష్ట్రంలోని 18 లక్షల విద్యుత్ కనెక్షన్లలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారనేది తెలుసుకునేందుకే మీటర్లు బిగిస్తున్నాం తప్ప మరో ఉద్దేశం లేదన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల 31 వేల 140 విద్యుత్ సర్వసులను తనిఖీ చేసి అక్రమాలు గుర్తించామని.. వాటిపై మొత్తం రూ.131 కోట్ల జరిమానా విధించామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Power cuts