ఉద్యోగుల పీఆర్సీ, డీఏ బకాయిల (AP Govt employees Salaries) పై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం కీలక జీవోలు జారీ చేసింది. రిటైర్మెంట్ తర్వాతే పీఆర్సీ, డీఏ బకాయిలను చెల్లిస్తామంటూ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉద్యోగులు పీఆర్సీ కోసం ఉద్యమం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడంతో సుదీర్ఘ చర్చల అనంతరం రాష్ట్రప్రభుత్వం పీఆర్సీని ప్రకటించింది. అప్పటి నుంచి దీనిపై కసరత్తు చేస్తూ బుధవారం జీవోలు జారీ చేసింది. ఐతే ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఉద్యోగులకు ఏమైనా బకాయిలంటే పీఎఫ్, జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. కానీ ఈసారి మాత్రం గతంలో ఎప్పుడూ లేని విధంగా రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామనడం ఇదే మొదటిసారి.
ఇక 2019 జులై నుంచి 2020 మార్చి వరకు ఇచ్చిన ఐఆర్ రికవరీని నిపిస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం, ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు 21 నెలలకు సంబంధించిన డీఏ, పీఆర్సీ ఎరియర్స్ మాత్రం రిటైర్మెంట్ తర్వాతే క్లియర్ చేయనుంది. ఇదే బకాయిలకు సంబంధించి పెన్షనర్లకు మాత్రం వచ్చే ఏడాది అంటే 2023 నుంచి నాలుగు త్రైమాసికాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఇదిలా ఉంటే ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ఐదేళ్లకే అమలు చేస్తున్నామని.. సెంట్రల్ పే కమిషన్ కు బదిలీ చేసే అంశాన్ని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్తగా అమల్లోకి వచ్చిన పే స్కేళ్లను కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లోని నాన్ టీచింగ్ స్టాఫ్ కు 2022 నుంచి వర్తింపజేస్తన్నట్లు ప్రభుత్వం జీవో ఇచ్చింది. పీఆర్సీ ప్రకారం పే స్కేల్ లోని గరిష్ట జీతానికి చేరుకున్న ఉద్యోగులకు ఐదు స్టాగ్నేషన్ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇక ఉద్యోగులకు గ్రేడ్ల వారీగా డీఏ, వసతికి సంబంధించిన భత్యాలు చెల్లించనున్నారు. పర్యటనలకు సబంధించి డైలీ అలవెన్సులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో పర్యటిస్తే రోజుకు రూ.600, ఇతర రాష్ట్రాలకు వెళ్తే రోజుకు రూ.800 చొప్పున చెల్లించనున్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బకాయిలను ఎప్పటిమాదిరిగానే పీఎఫ్ లో జమ చేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ, సీపీఎస్ అంశంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవల ఏకంగా సీఎంఓ ముట్టడికి పిలువునిన్వడం కూడా తీవ్రఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా బకాయిలన్నీ రిటైర్మెంట్ తర్వాతే ఇస్తామనడాన్ని ఉద్యోగ సంఘాలు ఎలా తీసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Employees