news18-telugu
Updated: August 1, 2020, 6:22 AM IST
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
వానాకాలం సాగు ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం వ్యవసాయం దాదాపు అంతా యాంత్రీకరణగా మారింది. యంత్రం లేనిదే.. వ్యవసాయం సాగేట్టు లేదు. అయితే రైతులకు యాంత్రీకరణ పనిముట్లపై భారం పడకుండా ఉండేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే వ్యవసాయ పరికరాలను 40 శాతం రాయితీతో పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 40 శాతం రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేయనున్నారు. ఆయా సంఘాలు ఏపీ సహకార బ్యాంకు ఆర్థిక సాయంతో వ్యవసాయ పరికరాలను సమకూర్చుకునే అవకాశం ఇచ్చింది. కేవలం వ్యవసాయ పనిముట్ల విలువలో 10 శాతం నిధులను సంఘాలు భరిస్తే.. బ్యాంకులు 40 శాతం రుణం మంజూరు చేయనున్నాయి. ఇక మిగిలిన 40 శాతాన్ని రాయితీ రూపంలో ప్రభుత్వం అందజేయనుంది. గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ పరికరాల పంపిణీలో జరిగిన అక్రమాలను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు.
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు పేర్కొన్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. అయితే ఈ వ్యవసాయ పరికరాల కొనుగోలుకు సంబంధించి కనిష్టంగా రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు, గరిష్ఠంగా రూ.1.20 కోట్ల నుంచి రూ.1.30 కోట్లను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సహకార బ్యాంకు మంజూరు చేయనుంది. తొలిదశలో ఈ ఏడాది గ్రామంలో ఒక సంఘానికి మాత్రమే రాయితీపై రుణం అందించనుంది.
Published by:
Narsimha Badhini
First published:
August 1, 2020, 6:22 AM IST