రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయించుకున్నవారికి కోలుకునే సమయంలో ఇచ్చే ‘ఆరోగ్య ఆసరా’ పరిధిని ప్రభుత్వం విస్తరిచింది. గతంలో 836 చికిత్సకు మాత్రమే ఆరోగ్య ఆసరా అందించేవారు. తాజాగా ఈ జబితాలో 683 చికిత్సలను చేర్చుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ‘ఆరోగ్య ఆసరా’ చికిత్సల సంఖ్య 1,519కి చేరింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున గరిష్టంగా రూ.5వేల ఆర్ధిక సాయం అందిస్తారు.
తాజాగా ప్రభుత్వం ఇచ్చిన జాబితాలో డెంగీ జ్వరంతో పాటు గైనకాలజీ, పల్మనరీ, డయాబెటిక్ ఫుట్ వంటి వ్యాధులకు అందించే చికిత్సలను చేర్చారు. ఈ చికిత్సల్లో దేనికైనా సరే వైద్యం పొంది ఇంటివద్ద కోలుకుంటూంటే వెంటనే బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ చేస్తారు. ఐతే డాక్టరు నిర్ణయించిన మేరకు విశ్రాంతి రోజులకు లెక్కించి ఆసరా సొమ్ము ఇస్తారు. ఐతే రోగులు తమ ఆధార్‌ను బ్యాంకుకు లింక్ చేసుకుంటేనే నిధులు జమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో మొత్తం 2,434 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. వైద్య ఖర్చులు వెయ్యి రూపాయలు దాటితే ఆ తర్వాత బిల్లు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. తొలుత ఈ పథకాన్ని 2020 జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. తొలిదశలో పథకాన్ని అమలు చేయగా. ఈ ఏడాది జూలై 16 నుంచి రాష్ట్ర మంతటా విస్తరింపజేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి చికిత్సను కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ కింద తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ వైద్యం చేయించుకునే అవకాశాన్ని కల్పించింది.
ఆరోగ్యశ్రీ కార్డులు:
గతంలో మాదిరిగా రేషన్ కార్డులతో సంబంధం లేకుండ వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారందరికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులను ప్రభుత్వం అందజేసింది. కార్డులకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేసింది. కార్డుపై ఉన్న కోడ్ ను స్కాన్ చేస్తే సదరు కుటుంబం యొక్క ఆరోగ్య వివరాలు యాప్ లో చూసుకునే సౌకర్యాన్న కల్పించింది.
వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు:
ఆరోగ్య శ్రీకి అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి వ్యాధి తీవ్రతను బట్టి రూ.రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్లు ఇస్తోంది. లెప్రసీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, పక్షవాతంతో మంచానికే పరిమితమైన వారికి, వీల్ ఛైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్ ప్రభుత్వం చెల్లిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aarogyasri, Andhra Pradesh, Dengue fever