ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వెలగపూడి సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాలు, అసెంబ్లీ, హైకోర్టు తదితర కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజులు పనిచేసే విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రతిపాదనలకు సీఎం జగన్ (CM YS Jagan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించిన సమయంలో ఉద్యోగులకు వారానికి ఐదురోజులు పనిదినాలను అప్పటి ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా అదే అవకాశాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో పొడిగించిన గడువు ఈనెల 27 నుంచి ముగియడంతో ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉంటే అమరావతి (Amaravati) లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతిని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్లాట్లను ఖాళీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నుంచే పాలన సాగించాలని భావించిన టీడీపీ (TDP) ప్రభుత్వం.. వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలను అమరావతికి తరలించింది. ఉద్యోగులకు 2016 నుంచి అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లో వసతి కల్పించింది. వారికి సంబంధించిన ఇంటి అద్దెను కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడువు ముగిసినా దశలవారీగా పొడిగిస్తూ వచ్చింది. ఐతే ప్రభుత్వం ఇచ్చిన పొడిగించిన గడువు జూన్ 30తో ముగుస్తుండటంతో ఫ్లాట్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఉచిత వసతిని రెండు నెలల పాటు పొడిగించింది. జూలై 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉచిత వసతి కొనసాగుతుందని సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో నగదు మాయం వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. మొత్తం 90వేల మంది ఉద్యోగుల ఖాతాల్లో నుంచి దాదాపు రూ.800 కోట్లు మాయమయ్యాయంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వమే కావాలని జీపీఎఫ్ సొమ్మును మాయం చేసిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఐతే సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎవరి ఖాతాల్లోనూ నగదు మాయం కాలేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government