ANDHRA PRADESH GOVERNMENT EMPLOYEES WARNING TO GOVERNMENT IF DO THAT WE WILL STRIKE TO DAY ON WARDS NGS
AP Employees Strike: ఈ రోజు నుంచే సమ్మె.. ఆ పని చేస్తే తప్పదని ఉద్యోగ సంఘాల వార్నింగ్
ఫైల్ ఫోటో
AP Employees Strike: ఆంధప్రదేశ్ ప్రభుత్వం - ఉద్యోగుల యుద్ధం మొదలైంది. నిన్నటి వరకు బుజ్జగింపులు.. విన్నపాలు అన్నట్టు సాగిన వ్యావహారం.. ఇప్పుడు వార్నింగ్ ల వరకు వెళ్లింది. ప్రభుత్వం చెప్పినట్టు ఆ పని చేస్తే నేటి నుంచే సమ్మెకు దిగుతామని పీఆర్సీ కమిటీ హెచ్చరించింది..
AP Employees Strike : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ ఇష్యూ మరింత ముదిరింది. పీఆర్సీ (PRC) రద్దు చేసిన తరువాతే చర్చలు అంటూ ఉద్యోగ సంఘాలు (Employees Union).. చెబుతూ వచ్చాయి.. కాదు.. ముందు చర్చలు చేయండి తరువాత పీఆర్సీ సంగతి తేలుద్దామని ప్రభుత్వం అంటోంది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే తమకు శత్రువులు కాదని.. ప్రభుత్వంలో భాగమే అని.. అందుకే వారితో చర్చల కోసం ఎదురు చూస్తూ ఉంటామన్నారు. నిత్యం 12 గంటల పాటు ఉద్యోగులతో చర్చల కోసం సచివాలయంలోనే ఎదురుచూస్తామంటూ మంత్రుల కమిటీ చెప్పింది. ఇలా ఓ వైపు చర్చలకు ఆహ్వానిస్తూనే.. మరోవైపు బెదిరింపు ధోరణులకు దిగింది. తాజాగా జనవరి శాలరీని.. రివైజ్డ్ పే స్కేల్ 2022ను అనుసరించి చెల్లించాలని ఆదేశించింది ట్రెజరీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ట్రెజరీ ఉద్యోగులు (Treasury Employees ) కూడా ఉద్యమంలో భాగం కావడంతో.. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాలేదు. లెటెస్ట్ గా…జీతాలు, పెన్షన్ల బిల్లుల ప్రక్రియపై మరోసారి ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. కొత్త పే స్కేళ్ల ప్రకారమే జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్ చేయాలని సూచించింది. ఒకవేళ కాదని మొండి పట్టుదలతో ప్రాసెస్ ప్రారంభించకుంటే.. క్రమశిక్షణా చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇక నిన్నటి వరకు ప్రభుత్వానికి వినతలు అందించాలనే ఉద్దేశంలోనే ఉన్న ఉద్యోగ సంఘాలు కూడా.. ప్రభుత్వం తీరుపై మండిపడింది. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దమయ్యాము అంటోంది. ప్రజల ముందు తమను దోషులుగా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఉద్యోగులకు పాత జీతాలే ఇవ్వాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. తమ ఉద్యమానికి సహకరిస్తున్న ట్రెజరీ ఉద్యోగులు, డీడీఓలపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తుందని వెంకట్రామిరెడ్డి అన్నారు. పాత జీతమే ఇవ్వాలని ప్రతి ఉద్యోగి డీడీఓలు.. హెచ్వోడీల వద్దకు వెళ్లి రాతపూర్వకంగా కోరాలన్నారు. దీని నిమిత్తం ఓ ప్రోఫార్మా రూపొందించామని తెలిపారు. చర్చలకు వచ్చే విషయంలో మా డిమాండ్లు ఏంటో ప్రభుత్వానికి తెలుసునన్నారు. మా ప్రతినిధి బృందం వచ్చి అభిప్రాయాన్ని చెప్పిందన్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదన్నారు. ప్రభుత్వం పాత జీతాలు ఇస్తేనే మాకు నమ్మకం కలుగుతుందన్నారు. తాము ఉద్యమ కార్యాచరణ ఇచ్చాం.. మాతో కాకుండా వేరే ఉద్యోగ సంఘాలు ఎవరైనా వస్తే వారితో ప్రభుత్వం చర్చలు జరపొచ్చు.. ఇబ్బందేమీ లేదు. వేరే ఉద్యోగ సంఘాలతో చర్చించుకుని కట్టడి చేయాలనుకుంటే చేసుకోవచ్చు అన్నారు.
ఉద్యమం చేస్తున్నామని చెప్పినా.. ట్రెజరీ ఉద్యోగులను ప్రభుత్వం బెదిరిస్తోందని.. అయినా ఉద్యోగులు బెదరడం లేదని.. ఉద్యమంలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే.. ఈ రోజు నుంచే సమ్మె ప్రారంభిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.