ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసగా రెండో ఏడాది వైఎస్ఆర్ కాపునేస్తం పథకాన్ని అమలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 3,27,244 మంది మహిళల ఖాతాల్లో రూ.490.86 కోట్ల ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఒక్కొక్కరి రూ.15వేలు చొప్పున ఖాతాల్లో జమ చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం జమ చేసిన నగదును బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఎకౌంట్లలో జమ చేశారు. నిరుపేద కాపు మహిళలను ఆర్ధికంగా ఆదుకునేందుకు 'వైఎస్‌ఆర్ కాపు నేస్తం' అందిస్తున్నామని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నామన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా 'వైఎస్‌ఆర్ కాపు నేస్తం'కు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది.. ఏం చేసిందో అందరూ ఆలోచించుకోవాలని గుర్తు చేశారు. ఏటా రూ.1,500 కోట్లు ఇస్తామని కనీసం ఏడాదికి రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రెండేళ్లలో 'వైఎస్‌ఆర్ కాపు నేస్తం' కింద రూ.12,126 కోట్లు అందించామని అన్నారు. 3,27,244 మంది లబ్దిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న కాపు మహిళలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారు.
ఈనెల మొదటి వారం నుంచి కాపు నేస్తంపై సర్వే జరిపిన ఏపీ ప్రభుత్వం.. వార్డు వాలంటీర్లు ద్వారా అర్హుల వివరాలను సేకరించింది. అనంతరం గ్రామ సచివాలయాల్లో అబ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుదిజాబితాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. దీంతో 3,27,244 అర్హులగా తేల్చింది. నగదు జమైన అంశానికి సంబంధించి మహిళల ఫోన్లకే సందేశాలు వెళ్లనున్నాయి. సంబంధిత బ్యాంకుకు వెళ్లి నగదు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ప్రభుత్వం కమ్మ,రెడ్డి, వైశ్య సామాజిక వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి ఏడాది ఆర్ధిక సాయం చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇక ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై జీవో జారీ చేసిన ప్రభుత్వం.. అర్హులైన వారికి సర్టిఫికెట్లు జారీ చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాపులతో పాటు అన్ని ఓసీ వర్గాలకు చెందిన వారు రూ.8లక్షల లోపు ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్ వర్తించనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, YSR Kapu Nestham