తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది కొవిడ్ రోగులు మృతి చెందిన ఘటన ప్రతిఒక్కరికీ కలచివేస్తోంది. విషాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. ఆక్సిజన్ అందక చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. రుయా ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని.. మన ప్రమేయం లేని అంశాలకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. తమిళనాడు నుంచి సరైన సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ రాకపోవడం వల్లే 11 మంది చనిపోయారన్నారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో జిల్లా కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఆక్సిజన్ కొరత నివారించడానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని జగన్ అన్నారు.
మరోవైపు రుయాఘటనతో రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులను నియమించింది. కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి వచ్చే ఆక్సిజన్ ఈ ముగ్గురు అధికారుల పర్యవేక్షణలో సరఫరా అవుతుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇదిలా ఉంటే తిరుపతి రుయా ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఆక్సిజన్ అందక 11 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తమిళనాడులోని పెరంబదూరు నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ రావడం 5 నిముషాలు ఆలస్యం అవడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించి నివేదిక కోరింది. అధికారులు చెబుతున్న లెక్క 11.. కానీ బాధితులు మాత్రం 25 మందిపైగానే చనిపోయారని ఆరోపిస్తున్నారు. రాయలసీమలోనే అత్యంత వసతి కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రి భారిన పడుతున్నారు. దింతో పేద, మధ్యతరగతి వారికీ రుయా ఆసుపత్రి పెద్ద దిక్కుగా మారింది.
ఆసుపత్రిలో అత్యధిక బెడ్లు కలిగిన విభాగాలని ఇప్పుడు కోవిడ్ ఆసుపత్రిగా సేవలు అందిస్తున్నాయి. ఆక్సిజన్ అందని విషయం తెలుసుకున్న బాధిత బంధువులు.. వార్డులోకి పరుగులు తీశారు. అప్పటికే కొంతమంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. వెంటిలేటర్ పై ఊపిరి అందక ఇబ్బంది పడుతున్న వారికీ... ఊపిరి అందించేందుకు బాధిత బంధువులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కన్నీరు పెట్టేలా చేశాయి. దాదాపు 30 నిమిషాల పాటు ఆక్సిజన్ సరఫరా ఆగిందని, నామమాత్రంగా కొందరికి మాత్రమే ఆక్సిజన్ ను సరఫరా చేసారని కరోనా బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Oxygen, Tirupati