కాశ్మీర్ లో ఉగ్రవాదులపై జరిగిన పోరులో వీరమరణం పొందిన తెలుగు జవాన్ జస్వంత్ రెడ్డికి ఆంధ్ర్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని జగన్ వ్యాఖ్యానించారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటంచేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనదని అన్నారు. మన జవాన్ చూపిన అసమాన ధైర్యసాహసాలకు ప్రజలంతా గర్విస్తున్నారన్నాంటూ నివాళులు అర్పించారు. ఈ కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్.. జస్వంత్ వీరమరణవార్త తెలిసిన వెంటనే కుటుంబానికి ఆర్ధికసాయం ప్రకటించారు.
గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెంకు చెందిన శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మల కుమారుడైన జస్వంత్ రెడ్డి 17 మద్రాస్ రెజిమెంట్ లో 2016లో సైనికుడిగా చేరారు. శిక్షణ అనంతరం తొలుత నీలగిరిలో పనిచేశారు. ఆ తర్వాత కాశ్మీర్ కు బదిలీపై వెళ్లారు. గురువారం కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా సుందర్బనీ సెక్టార్లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జస్వంత్ రెడ్డి వీరమరణం పొందారు. జస్వంత్ రెడ్డి మృతితో కొత్తపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. త్వరలోనే జస్వంత్ కు పెళ్లి చేయాలని కుటంబ సభ్యులు భావిస్తున్నారు. ఈలోగా ఉగ్రవాదుల తూటాకు జస్వంత్ బలయ్యాడు. జస్వంత్ భౌతిక కాయాన్ని స్వగ్రామం తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
దేశరక్షణకోసం కశ్మీర్లో ప్రాణాలర్పించిన బాపట్లకు చెందిన మన జవాన్ జశ్వంత్‌రెడ్డి ధైర్యసాహసాలు, త్యాగం చిరస్మరణీయం. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.#jaswanthreddy
జస్వంత్ మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు హోం మంత్రి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జస్వత్ కు నివాళులర్పించారు. జస్వంత్ కుటుంబ సభ్యులుకు సానుభూతి తెలియజేశారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. జస్వంత్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.
పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఎల్వోసీ మీదుగా భారత్‌లోకి చొరబడుతున్నారన్న ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో.. భారత ఆర్మీ రంగంలోకి దిగింది. దాదల్ అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలించాయి. ఈ క్రమంలోనే వారికి పాకిస్తాన్ ఉగ్రవాదులు తారసపడ్డారు. జవాన్లకు చూడగానే వారు కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసిరారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లు కూడా అమరవీరులయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన మరుప్రోలు జశ్వంత్ రెడ్డితో పాటు మరో సైనికుడు శ్రీజిత్ మరణించారు. ఉగ్రవాదుల వద్ద భారీగా మారణాయుధాలు లభ్యమయ్యాయి. రెండు ఏకే 47 రైఫిల్స్‌తో పాటు నాలుగు మేగజైన్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.