వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమే

TDP vs YCP : వైసీపీ నేతలు చంద్రబాబుపై అనేక అంశాల్లో మండిపడుతున్నారు. అందులో అప్పుల అంశం కీలకంగా మారనుంది. ఎవరు అధికారంలోకి వచ్చినా... అప్పుల భారంతో నానా ఇబ్బందులు తప్పవు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 28, 2019, 6:23 AM IST
వైసీపీ, టీడీపీ... ఏపీలో ఎవరు గెలిచినా అప్పుల తిప్పలే... సీఎం సీటు ముళ్ల కిరీటమే... బిల్లుల భారమే
జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
  • Share this:
ఏ రాష్ట్రంలోనైనా అధికారంలోకి రావడం ఆనందకర విషయం అవుతుందేమోగానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం దాదాపు అదో ఇబ్బందికర పరిణామం. సీఎం సీటు ఓ ముళ్ల కిరీటం. మే 23 తర్వాత అందులో ఎవరు కూర్చున్నా... ఆర్థిక సమస్యల సునామీని ఎదుర్కోక తప్పదు. మరీ అంతుందా అని అనుకోవద్దు. లెక్కలతో సహా వివరాలు తెలిస్తే... నిజమే అని మీకే అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏపీకి నిధులు టైముకి ఇవ్వట్లేదు. కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అవి క్లియర్ అవ్వాలంటే కనీసం 3 నెలలు పడుతుందని అంచనా. అసలీ డబ్బు కొరత ఎందుకొచ్చిందంటే... ఏపీ టీడీపీ ప్రభుత్వం చివరి ఏడాదిలో భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలుచేసింది. వాటి కోసం నిధులన్నీ ఊడ్చేసింది. అప్పులు చేసింది. దానికి తోడు చివరి ఏడాదిలో నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయి. అందువల్ల ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో అంచనా వేసిన దాని కంటే రూ.18,000 కోట్లు ఎక్కువ ఖర్చు పెట్టింది. ఎందుకంటే కేంద్రం నుంచీ మనకు గ్రాంట్ల రూపంలో దాదాపు రూ.50,000 కోట్లు రావాల్సి ఉంది. కానీ రూ.32,000 కోట్లు మాత్రమే వచ్చాయి. ఒక్క పోలవరం ప్రాజెక్టుకే కేంద్రం రూ.4,000 కోట్లు ఇవ్వకుండా వాయిదా వేస్తోంది. జిల్లాల అభివృద్ధికి రూ.700 కోట్లు ఇచ్చింది... మళ్లీ వెనక్కి తీసేసుకుంది. రాజధానికి రూ.2,500 ఇవ్వాలి. ఇప్పటివరకూ రూ.1,500 కోట్లే ఇచ్చింది.

చాలా శాఖల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పసుపు-కుంకుమ, పెన్షన్లు, అన్నదాత సుఖీభవ పథకాలకు పెద్ద ఎత్తున నిధులను మళ్లించారు. ఫలితంగా మిగతా పనులకు నిధుల కొరత ఏర్పడింది. వాటికి సంబంధించిన బిల్లులు అలాగే ఉన్నాయి. అవి రూ.14,400 కోట్ల దాకా ఉన్నాయి. ఇక 14వ ఆర్థిక సంఘం లెక్కల్లో లోపాల వల్ల... ఏపీకి దాదాపు రూ.20,000 కోట్ల నష్టం వచ్చిందన్నది మరో పిడుగు లాంటి విషయం.

ఈ సంవత్సరం మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌కి ఉన్న అప్పులు రూ.1,92,687 కోట్లు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక రూ.95,564 కోట్ల అప్పుల భారం పెరిగింది. 2018-19 బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయం రూ.65,000 కోట్లు ఉంటుందని అనుకుంటే... అది కాస్తా రూ.57,000 కోట్లే వచ్చింది. ఈ పరిస్థితులన్నీ కలిసి... మే 23న ఎవరు అధికారంలోకి వచ్చినా... ఉన్న అప్పుల్ని సెటిల్ చేసుకోలేక తిప్పలు పడే ప్రమాదం కనిపిస్తోంది. పైగా... అటు టీడీపీ, ఇటు వైసీపీ రెండు పార్టీలూ ఎన్నికల్లో ఇష్టమొచ్చినట్లు పథకాలు ప్రకటించాయి. వాటికి డబ్బు ఎక్కడి నుంచీ వస్తుందన్నది మాత్రం ఆలోచించలేదు. ఆల్రెడీ అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో... కొత్తగా పథకాలకు మరిన్ని నిధులు తేవాలంటే కష్టమే కదా. ఇన్ని సమస్యలూ ఉన్నా... అన్నింటినీ సరిచేస్తూ పాలన సాగించడమంటే సవాలే. అలా చెయ్యగలిగితే... ఆ పార్టీనీ, దాని పాలకులనూ మెచ్చుకోవాల్సిందే. అలాకాకుండా మరిన్ని అప్పుల్లోకి రాష్ట్రాన్ని నెడితే మాత్రం మనందరికీ సమస్యే.

 

ఇవి కూడా చదవండి :

SRH VS RR : సన్‌ రైజర్స్‌కి మరో ఓటమి... దుమ్మురేపిన రాజస్థాన్ రాయల్స్...

ఉత్తరాంధ్రలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ... ప్రభావం చూపిస్తున్న జనసేన...పవన్ కళ్యాణ్ బాటలో నాగబాబు... జబర్దస్త్ విషయంలో ఏమన్నారంటే...

మాకొద్దీ ఎన్నికల బెట్టింగ్ బాబోయ్... టెన్షన్ తట్టుకోలేకపోతున్న ప్రజలు...
First published: April 28, 2019, 6:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading