Andhra Pradesh: దేవాలయాల్లో అక్రమాలపై ఏపీ సర్కార్ సీరియస్.. ఆకస్మిక తనిఖీలపై ఆదేశాలు

దేవాలయాల్లో అక్రమాలపై దేవాదాయ శాఖ సీరియస్

ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో అక్రమాలపై దేవాదాయ శాఖ సీరియస్ అయ్యింది. ముఖ్యంగా అధికారుల పర్యవేక్షణ లోపంతోనే అధికంగా అక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడుతోంది. అందుకే ఇకపై రెగ్యులర్ గా ఆకస్మిక తనిఖీలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

 • Share this:
  తెలుగు రాష్ట్రాల్లో దేవుడ్ని నమ్మోవారు కోట్లలో ఉన్నారు. అందుకే కాస్త పేరు గాచించిన పుణ్యక్షేత్రమైతే చాలు లక్షాలాది జనం నిత్యం వస్తు ఉంటారు. దేవుళ్లకు తమ మొక్కులు తీర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరాలంటూ హుండిలో తోచినంత వేస్తుంటారు. అయితే కొంతమంది భక్తులు లక్షల్లో, కోట్లలో కూడా విరాళాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఆలయాలకు అనూహ్య సంపద పెరిగింది. దాదాపు ఏపీలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాలు కోట్లకు పడగలెత్తినవే.. దేవాలయాలకు భారీగా ఆదాయం వస్తుండడంతో.. అవినీతి కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ క్షేత్రాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ఇప్పటికే ఎన్నో స్కామ్ లు వెలుగులోకి వచ్చాయి. భక్తులు ఇచ్చే ప్రసాదం నుంచి దేవుడికి పెట్టే బట్టలు వరకు అన్నీ అక్రమాలే.. పై స్థాయి అధికారుల నుంచి కింద స్థాయి సిబ్బంది వరకు చాలామంది చేతులు తడుపుకున్న వారే కనిపిస్తున్నారు. దీంతో దేవాలయాల్లో అవినీతిపై తరచూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవాలయాల్లో అక్రమాల కట్టడికి దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది.

  ఇకపై దేవాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని వివిధ స్థాయిల్లోని అధికారులకు దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. గత కొంత కాలంగా రెగ్యులర్‌ చెకింగ్‌లు లేకపోవడంతో దేవాలయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డ దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జున రావు. కొందరు ఈవోలు ఉన్నతాధికారులిచ్చే ఆదేశాలు పాటించడం లేదని కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

  ఆకస్మిక తనిఖీల్లో క్యాష్‌ బుక్‌, వోచర్లు, నిర్మాణ పనులు వంటి అంశాలను పరిశీలించాలని సూచనలు చేశారు. దేవుని నగలు, దేవాలయాల ఆస్తుల పరిస్థితిపై ఆకస్మిక తనిఖీల్లో ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని ఆదేశించారు. ఏయే స్థాయి అధికారులు.. ఏయే దేవాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.. ఎవరికి రిపోర్ట్‌ చేయాలనే విషయాలపై సర్క్యులర్‌ జారీ చేశారు.

  అయితే దేవాదాయశాఖ జారీ చేసిన ఆదేశాలపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు ముందే చెబితే అవినీతి పరులు జాగ్రత్త పడరా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటి వరకు వెలుగు చూసిన అవినీతిపై ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. ముఖ్యంగా దుర్గగుడి విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ధార్మిక సంస్థలు..
  Published by:Nagesh Paina
  First published: