లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఏపీలో మళ్లీ బ్రేక్... నిషేధం ఉందన్న ఈసీ... విడుదల అవుతుందన్న రాంగోపాల్ వర్మ

Lakshmi's NTR : ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగుతున్నాయన్న రాష్ట్ర ఎన్నికల సంఘం... ఆ సినిమా ప్రదర్శనకు అనుమతులు ఇవ్వవద్దని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 1, 2019, 5:52 AM IST
లక్ష్మీస్ ఎన్టీఆర్‌కి ఏపీలో మళ్లీ బ్రేక్... నిషేధం ఉందన్న ఈసీ... విడుదల అవుతుందన్న రాంగోపాల్ వర్మ
లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఓ దృశ్యం.
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత రిలీజ్ అవుతుందని అందరూ భావించినా... రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు విరుద్ధంగా స్పందించింది. సినిమా విడుదలపై నిషేధం విధిస్తూ ఏప్రిల్ 10న కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమలులోనే ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా రిలీజ్ విషయంలో ఈసీఐ ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని హోంశాఖ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. థియేటర్లలో సినిమాను ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇవ్వొద్దన్నారు. రాజకీయంగా ప్రభావం చూపే బయోపిక్‌లపై దేశవ్యాప్తంగా నిషేధం విధిస్తూ ఏప్రిల్‌ 10న కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల్ని ఆయన మరోసారి గుర్తుచేశారు. దాన్ని విధిగా అందరూ పాటించాలని స్పష్టం చేశారు. ఐతే... మే 1న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ఏపీలో రిలీజ్‌కు పర్మిషన్ ఇవ్వాలని డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ ఏప్రిల్‌ 25న లేఖ ద్వారా కోరితే, ఇదే విషయాన్ని లేఖ ద్వారా తెలిపామని ద్వివేదీ వివరించారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌‌తోపాటు మరో 2 సినిమాలపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇలాంటి ఉత్తర్వులే జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించేవరకూ ఏప్రిల్‌ 10న రిలీజ్ చేసిన ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు.

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా కచ్చితంగా మే 1న రిలీజ్ అవుతుందని వర్మ వారం నుంచీ ప్రకటిస్తున్నారు. మొన్ననే ఆయన విజయవాడ రోడ్డుపై ప్రెస్ మీట్ పెడతానని ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపింది. ప్రెస్ మీట్‌కి అనుమతి ఇవ్వని పోలీసులు... వర్మను తిరిగి హైదరాబాద్ పంపించెయ్యడంపై తీవ్ర దుమారమే రేగింది. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ వాయిదా పడటం చర్చనీయాంశం అవుతోంది. వర్మ మాత్రం హైకోర్టు అనుమతితోనే సినిమా రిలీజ్ చేస్తామంటూ ఓ ట్వీట్ పెట్టారు.ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని చోట్ల ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలు జరిగాయి. సినిమా రిలీజ్ వాయిదా పడితే... పరిస్థితి గందరగోళం అయ్యే అవకాశాలున్నాయి.
Published by: Krishna Kumar N
First published: May 1, 2019, 5:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading