Home /News /andhra-pradesh /

ఏపీలో దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు డీజీపీ కీలక ఆదేశాలు

ఏపీలో దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు డీజీపీ కీలక ఆదేశాలు

తిరుమల శ్రీవారి ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయం

ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు.

    Antarvedi Chariot: ఆంధ్రప్రదేశ్‌ లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత ఉండే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సూచించారు. పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలకు అప్రమత్తం చేశామన్నారు. దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్న ఆయన రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద అన్ని భద్రత చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారిని పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు.

    సెప్టెంబరు 5న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న దివ్య రథం అగ్నికి ఆహుతయింది. 60 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ రథం 40 ఎడుగుల ఎత్తు ఉంది. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు. అలాంటి రథం మంటల్లో కాలిపోవడంతో భక్తులు భగ్గుమన్నారు. రథానికి మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా? లేదంటే కుట్ర ఉందా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీని వెనక హిందూ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందని ఆరోపిస్తూ బీజేపీ, జనసేన, హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది.

    అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని విజయసాయిరెడ్డి, రోజా సెల్వమణి ఆరోపించారు. అయితే, దేవాలయాలపై వరుస దాడులు సీఎం జగన్, విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లోనే జరుగుతున్నాయని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఇలా అన్ని పార్టీలు ఒకరి మీద మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP DGP, Gautam Sawang

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు