ఆలయాలపై దాడులు విషయంలో ఆంధ్రప్రదేశ్ అట్టుడుకుతోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామాలయంపై దాడి జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే తీవ్రరాజకీయ దుమారానికి తెరలేచింది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఐతే ఇది సున్నితమైన అంశం కావడంతో పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. అలయాలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్ మరియు విజిటబుల్ పోలీసింగ్ కు ఆదేశాలిచచ్చినట్లు డీజీపీ తెలిపారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల పవిత్రతను కాపాల్సిన అందరిపైనా ఉందని డీజీపీ అన్నారు.
ఆలయాల్లో పనిచేసే అర్చకులు, పూజారులు ఆలయాల నిర్వాహకులు నిత్యం అప్రమత్తంగా వ్యవహరించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ సచించారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే తక్షణమే సమాచారాన్ని పోలీసులకు లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమివ్వాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవలయాలు, ప్రార్ధనా మందిరాల భద్రతా చర్యలను పర్యవేక్షించాలని అన్ని జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆలయాన్ని జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించు. మతసామరస్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చుపెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు.ఆలయాలపై దాడులు చేసే వారిపై కఠిన శిక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసే వేగంగా శిక్షలు పడేలా చేస్తూమని చెప్తోంది.
దర్యాప్తు ముమ్మరం
ఇక రామతీర్థం ఘటనపై విజయనగరం జిల్లా పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి 21 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు. ఆలయ కొలనులో శ్రీరాముడి విగ్రహ శిరస్సు భాగాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, అక్కడే హాక్సా బ్లేడును సేకరించారు. దుండగులు పగలగొట్టిన ఆళయ తాళాన్ని కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. అనుమానితుల నుంచి వేలిముద్రలు సేకరించిన అధికారులు ఘటనాస్థలిలో దొరికిన ఆధారాలపై ఉన్న వేలిముద్రలతో పోల్చి చూస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో టీడీపీకి చెందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లోనే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపెడతామని పోలీసులు చెప్తున్నారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, AP Police, Damodar Goutam Sawang, Hindu Temples