పేరుకే అవి కార్పొరేట్ విద్యాసంస్తలు. ఆర్భాటపు ప్రచారాలు., ర్యాంకుల వలతో లక్షల్లో వసూళ్లు. ఇదీ కార్పొరేట్ కళాశాలల తీరు. ఫీజులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ.., విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంపై ఉండటం లేదు. కార్పొరేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వస్తున్నయన్న ఆరోపణలు రావడతో విద్యాశాఖ కమిషన్ అధికారులు ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా విజయవాడలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీ చైతన్య, నారాయణ స్కూళ్లను పరిశీలిన అధికారులకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్చడం లేదు. సంక్రాంతి సందర్భంగా ఫీజు రూపంలో ఒక్కోక్క విద్యార్థి నుంచి రూ.60 వేల నుంచి రూ.70వేల వరకు ఫీజులు కట్టించుకొని పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పింలేదని అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
విజయవాడ రూరల్ మండలం, గూడవల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో దారుణమైన పరిస్థితులున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కే రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు ఫీజు వసూలు చేస్తున్న యాజమాన్యాలు కనీసం తాగునీరు, బాత్ రూమ్ సౌకర్యాలు కూడా సరిగా కల్పించడం లేదని తేలింది. దాదాపు 10 మంది విద్యార్థులకు ఒక్క టాయిలెట్ కేటాయించినట్లు తేలింది. ఇక హాస్టల్లో భోజనం కూడా సరిగా పెట్టడం లేదని విద్యార్థులు వాపోయారు.
నారాయణ కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధిక ఫీజులను నియంత్రిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.51ను తుంగలో తొక్కుతూ భారీగా వసూలు చేస్తున్నట్లు తేలింది. ఫీజులు వసూలు చేసినా విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని కమిషన్ సభ్యులు సీఏవీ ప్రసాద్ తెలిపారు. అలాగే కాలేజీల్లో కొవిడ్ నిబంధనలు పాటించనట్లు వెల్లడైంది. విద్యార్థుల మధ్య సామాజిక దూరం పాటించకపోగా..,శానిటైజర్లు కూడా అందుబాటులో ఉంచలేదు. కార్పొరేట్ కాలేజీల్లో సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉండటంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఇక ట్యూషన్ ఫీజుల్లో 30శాతం తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని అధికారులు తెలిపారు.
ఇక ర్యాంకుల కోసం కార్పొరేట్ కళాశాలలు చేసే నిర్వాకాలు అన్నీఇన్నీ కావు. స్టార్ బ్యాచ్ పేరుతో విద్యార్థులను వేరు చేసి చదివించడం, తక్కువ మార్కులు వచ్చేవారిని అవమానకరంగా మాట్లాడటం అందరికీ తెలిసిందే. కొన్ని చోట్ల వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఐతే నిబంధనలు తుంగలో తొక్కి విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుతింటున్న కార్పొరేట్ కలశాళాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Published by:Purna Chandra
First published:January 21, 2021, 14:53 IST