news18-telugu
Updated: January 13, 2021, 4:27 PM IST
ఆంధ్రప్రదేశ్ లో జోరుగా సంక్రాంతి కోడి పందేలు
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. కోర్టు ఆంక్షలున్నా, పోలీసుల హెచ్చరికలు జారీ చేసినా పందెం రాయుళ్లు మాత్రం వెనకడుగు వేయలేదు. వారం రోజులుగా పందెం బరులను పోలీసులు ధ్వంసం చేసినా కోళ్లు మాత్రం కత్తికట్టాయి. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే పందెం రాళ్లు బరులకు చేరుకొని వేలు, లక్షల్లో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో కోళ్ల పందాల బరులు భారీ ఎత్తున సిద్ధం చేశారు. అలాగే లంక గ్రామాలే కాకుండా నదీపాయల్లోని బరుల్లో కూడా కోడి పందేలు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం, గోపాలపురం, దేవరపల్లి కాళ్ళ , తణుకు మండలం తేతలి, ఆచంట, పెనుగొండ, పోడూరు, పెనుమంట్ర తదితర ప్రాంతాల్లో కోడి పందాల బరులు భారీ ఎత్తున సిద్ధమయ్యాయి. తదితర ప్రాంతాల్లో కోడిపందాలు సాగుతున్నాయి. గుంటూరు జిల్లాలోని తెనాలి, రెపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో కూడా జోరుగా కోడిపందాలు సాగుతున్నాయి.
ఇక కృష్ణాజిల్లా గన్నవరం, ఉంగుంటూరు, కంకిపాడు, పెనమలూరు, బాపులపాడు, కంచికచర్ల, నందిగామ, తోట్లవల్లూరు మండలాల్లో బరులు వెలిశాయి. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఉదయం నుంచే పందేలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇక ఏటా మాదిరిగానే ఈ కోడి పందేలపై లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గత ఏడాది వరకు ప్రతి ఏటా పందేల నిర్వాహకులు ఒకే చోట బరులు ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఈసారి మాత్రం రూటు మార్చారు. ఎప్పుడు వేసే చోట కాకుండా ప్రధాన రహదారులకు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో, కొబ్బరి తోటలు, మామిడి తోటలు, పామాయిల్ తోటల్లో బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహిస్తున్నారు.
సంక్రాంతి సమయంలో ఉభయగోదావరి జిల్లాలపైనే పోలీసులు దృష్టి పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలోనే పోలీసులు 250 బరులను గుర్తించి ధ్వంసం చేశారు. 190 కేసులను నమోదు చేసి 600 మందికి పైగా బైండోవర్ చేశారు. వేల సంఖ్యలో కోడి కత్తులను సీజ్ చేశారు. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో 144, సెక్షన్ 30 అమలులో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వెయ్యి మందికి పైగా బైండోవర్ కేసులు నమోదు చేసారు. దాదాపు 10వేల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కోళ్ల పెంపకం దారులపైనా ముందస్తు కేసులు నమోదు చేసిన పోలీసులు.., పొలాలు, తోటలను బరులకు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని భూముల యజమానులను హెచ్చరించారు. అలాగే జిల్లాలో కోడిపందేలను అరికట్టేందుకు 35 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పందేల సందర్భంగా భారీగా నగదు చేతులు మారే అవకాశముండటంతో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు కూడా దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
Published by:
Purna Chandra
First published:
January 13, 2021, 4:27 PM IST