news18-telugu
Updated: October 1, 2020, 9:51 AM IST
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త... అక్టోబర్ 1న ప్రభుత్వం కీలక ప్రకటన
YS Jagan on Farmers: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఏయే పంటకు ఎంత మద్దతు ధరో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్దతు ధరలపై క్యాంపు కార్యాలయంలో నిన్న సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఖరారు చేసే కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు ఎక్కడా కొనుగోలు జరగకూడదు, వీలుంటే ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు జరిగేలా చూడాలి. రైతులకు ఏ విధంగా కూడా నష్టం జరగకూడదు ఈ విషయంలో రాజీ పడొద్దు. రైతుల ఉత్పత్తులకు మార్కెట్లో పోటీ ఏర్పడాలి, తద్వారా రైతులకు మెరుగైన ధర రావాలి. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి, మార్కెట్లో పోటీ ఏర్పడేలా చేస్తుంది. తమ పంటలు అమ్ముకోవడంలో ప్రభుత్వం రైతులకు సహాయకారిగా నిలుస్తుంది. గత ఏడాది రైతులకు కనీస గిట్టుబాటు ధర రావాలని దాదాపు రూ.3200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం పలు పంటలు కొనుగోలు చేసింది. ఇంకా ధాన్యం కొనుగోలు కోసం మరో రూ.11,500 కోట్లు ఖర్చు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా చెప్పిన దాని కన్నా ఎక్కువ కేటాయించి పంటలు కొనుగోలు చేయడం జరుగుతోంది. ఈ ఏడాది కూడా రూ.3300 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదన్న బెంగ రైతులకు అస్సలు వద్దు. పంటలకు ముందుగానే ధరలు ప్రకటిస్తామని చెప్పాం. ఆ మేరకు అక్టోబరు 1న పంటలకు కనీస మద్దతు ధరలు (ఎంఎస్పీ) ప్రకటించబోతున్నాం. అంతే కాకుండా తప్పనిసరిగా ఆ ధరలు రైతులకు దక్కేలా చూస్తాం. కనీస ధర లేక ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు, అదే ఈ ప్రభుత్వ లక్ష్యం.’ అని స్పష్టం చేశారు.
ఇక రైతుల ఉత్పత్తులకు గ్రామాల్లో కూడా మార్కెటింగ్ సదుపాయం కల్పించడం కోసం జనతా బజార్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆ బజార్లలో తప్పనిసరిగా ఫ్రీజర్లు ఉండాలన్నారు. రైతుల ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న రిలయన్స్, ఐటీసీ, పీ అండ్ జీ, హిందుస్తాన్ లీవర్ వంటి సంస్థలను కూడా జనతా బజార్లలోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా జనతా బజార్లతో పాటు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పని రైతులకు మేలు చేసే విధంగా ఉండాలన్నారు. వారు ఎక్కడా నష్టపోకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
October 1, 2020, 9:50 AM IST