ANDHRA PRADESH CM YS JAGANMOHAN REDDY CONDUCTED REVIEW ON AMARAVATHI CONSTRUCTION AND NEW PROJECTS IN VISAKHAPATNAM HERE ARE THE DETAILS PRN
Andhra Pradesh: అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్... సీఎం జగన్ కీలక ఆదేశాలు... కొత్త ప్రాజెక్టులు ఇవే...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కీలకమైన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నం, ఏఎంఆర్డీయే (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ) పరిధిలో ప్రాజెక్టులపై సీఎం జగన్ చర్చించారు. విశాఖపట్నంలోని సముద్రతీరంలో 13.59 ఎకరాల స్థలంలో ప్రాజెక్టు ప్రతిపాదనలపై చర్చించారు. ఇదే భూమిని గత ప్రభుత్వం లూలూ గ్రూపుకు అతి తక్కువ ధరకు 33 ఏళ్ల లీజుకు కట్టబెట్టినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చేలా, విశాఖకు తలమానికంగా ఉండేలా అధికారులు చేసిన ప్రతిపాదనలను పరిశీలించారు. వీటిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్బీసీసీ, ఏపీఐఐసీ ఇచ్చిన ప్రతిపాదనలపై చర్చించారు. కమర్షియల్ ప్లాజా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాల వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.1,450 కోట్ల నికర ఆదాయం వస్తుందన్న ఎన్బీసీసీ అధికారులు పేర్కొన్నారు.
వేగంగా అమరావతి పనులు
ఇక అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టులపైనా సీఎం జగన్ చర్చించారు. కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను అదికారులు సీఎంకు వివరించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం దాదాపు రూ.150 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పగా.. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. కరకట్ట రోడ్డుతో పాటు దానికి ఆనుకొని ఉన్న రహదారులను అభివృద్ధి చేయాలన్నారు. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్డును మెయిన్ రోడ్డుకు అనుసంధానం చేసే పనులుకూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును త్వరగా కంప్లీట్ చేసి ఫ్లాట్లను సిద్ధం చేయాలన్నారు. ఇక అమరావతి నిర్మాణంలో భాగంగా అసంపూర్తిగా ఉన్న భవనాలను వేగంగా పూర్తి చేయాలని జగన్ స్పష్టం చేశారు.
అమరావతిలో చేపట్టిన నిర్మాణాల పురోగతి, అయిన వ్యయం.. భవనాలు పూర్తి చేయడానికి అవసరమైన నిధులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. నిధుల లభ్యతపై పూర్తి స్పష్టతతో ఉండాలని అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, సీసీఎల్ఏ స్పెషల్ సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి. ఉషారాణి, ఏఎంఆర్డీఏ కమీషనర్ పి. లక్ష్మీ నరసింహం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.