గోదావరి వరద (Godavari Floods) ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయం నుంచి సీఎం జగన్ (CM YS Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద సహాయక చర్యలపై 6 జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం కీలక ఆదేశాలిచ్చారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందిని.., సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉందని సూచించారు. సీనియర్ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉందన్న జగన్.., రానున్న 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల సహాయం అందాలని ఆదేశించారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్‌తో కూడిన రేషన్ పంపిణీ జరగాలన్నారు. రేషన్ సరుకులన్నీ బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలని స్పష్టం చేశారు.
కలెక్టర్లు, సీనియర్ అధికారులు దీన్ని సవాల్ గా తీసుకొని ప్రతి గ్రామంలోని పంపిణీని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. గతంలో రెండు జిల్లాలకు ఇద్దరు కలెక్టర్లు, ఇద్దరు ఎస్పీలు మాత్రమే ఉండేవారని.. కానీ ఇప్పుడు కాకినాడతో కలుపుకుని ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు ఉన్నారని.. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ, వాలంటీర్లను ఉపయోగించుకొని ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
గతంలో ఎప్పుడూ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం చేయలేదని.., విరామం ఎరుగకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని సీఎం అన్నారు. ఇలాంటి సమయంలోనూ ప్రతిపక్షాలు, ఓ వర్గం మీడియా రాష్ట్రం ప్రతిష్ట, అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుని జగన్ విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని.., మంచి చేస్తున్నప్పుడు వెనకడుగు వేయాల్సిన అవసరంలేదని జగన్ అన్నారు. దురుద్దేశ పూర్వకంగా చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
వరద బాధితులకు సాయం చేసేందుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని.. నిధుల సమస్య లేనేలేదని సీఎం స్పష్టం చేశారు.అవసరమున్న చోటల్లా సహాయ శిబిరాలు కొనసాగించాలని.. శిబిరాల్లో మంచి ఆహారం.. తాగునీరు అందించాలని ఆదేశించారు. బాధితులు శిబిరాలకు వచ్చినా, లేకున్నా.. ముంపునకు గురైన ప్రతి కుటుంబానికీ కూడా రూ.2వేల ఆర్థిక సహాయం, రేషన్ అందాలని సీం అన్నారు.
ఇది చదవండి: మోదీ పర్యటనపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. అందుకే దూరంగా ఉన్నానన్న జనసేనాని
వరద తగ్గుముఖం పట్టిన వెంటనే 10 రోజుల్లో పంట, ఆస్తి నష్టాలపై అంచనాలు పూర్తిచేయాలని జగన్ స్పష్టం చేశారు. గర్భవతులైన మహిళలపట్ల ప్రత్యేక శ్రద్ధవహించాలని.., వారిని ఆస్పత్రులకు తరలించాలని చెప్పారు. ఆస్పత్రుల్లో వైద్యాధికారులు, స్పెషలిస్టులు అందుబాటులో ఉంచేలా చూసుకోవాలని.., వరదల కారణంగా, ముంపు ప్రభావం తగ్గగానే అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని.. అలాంటివి లేకుండా ముందుస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
గోదావరి కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం.., అన్ని డ్రెయిన్ల ముఖద్వారాలు మూసుకుపోయే అవకాశం ఉన్నందున.. అక్కడ పూడిక తొలగించే పనులు చేపట్టాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ, మరమ్మతు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని.., 48 గంటల్లో సమస్యను పరిష్కరించాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.