ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. విజయవాడ నుంచి హెలికాఫ్టర్ ద్వారా పోలవరం వెళ్లిన ఆయన తొలుత ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు అనిల్ కుమార్, పేర్ని వెంకట్రరామయ్య, ఇతర అధికారులు స్వాగతం పలికారు. సీఎం తొలుత ప్రాజెక్ట్ స్పిల్ వే పనులను స్వయంగా పరిశీలించారు. పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ఈసందర్భంగా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పాటు పోలవరం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా సంస్థకు చెందిన ఇంజనీర్లు కూడా సీఎంకు పనుల గురించి వివరించారు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం మంత్రులు, అధికారులతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
కీలక ఆదేశాలు
మిషన్ 20212ఖరీఫ్ లక్ష్యంగా పని చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లో 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆర్థిక పరమైన సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయ చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్ నిధులన్నీ విడుదలవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం సానుకూల స్పందన
2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి తెలిపింది. ఈ నేపథ్యంలో 2017–18 ధరల ప్రకారం పోలవరానికి నిధులు విడుదల చేయాలని కోరగా ఇందుకు పీపీఏ సానుకూలంగా స్పందించి సిఫారసు చేసింది. పీపీఏ సిఫారసుల మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ, ఆర్థికశాఖలు దీనిపై నిర్ణయం తీసుకోనున్నాయి. ఇటీవల రూ.2,234.28 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేసింది. ప్రాజెక్ట్ ప్రొటోకాల్ ప్రకారం నిర్మించిన తొలి ఏడాదిలో పూర్తిస్థాయి నీటిమట్టాన్ని నిల్వ చేయకూడదు. అందుజేత తొలి ఏడాది 41.5 అడుగుల మేర నీటిని నిల్వచేయనున్నారు. ఈ స్థాయి నీటిమట్టం వల్ల ముంపుకు గురయ్యే 17వేల 760 కుటుంబాలకు తొలుత పునరావాసం కల్పించాలని సీఎం జగన్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత క్రమంగా నీటి మట్టం పెంచుకుంటూ వెళ్తూ మొత్తం 373 గ్రామాల్లోని లక్షా 5వేల 601 కుటుంబాలకు పునారావం కల్పిస్తామన్నారు.
పోలవరం పర్యటనలో సీఎం జగన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు తానేటి వనితా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ష, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, ఎంపీ మార్గని భరత్, రాజ్యసభ సభ్యులు పిల్లిసుభాష్ చంద్రబోష్, కలెక్టర్లు రేవు ముత్యాల రాజు, మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, రాపాకవరప్రసాద్, పుప్పాల వాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anil kumar yadav, Ap cm ys jagan mohan reddy, Polavaram, Ys jagan