ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ YSR ఆసరా పథకం మూడో విడత నిధులను విడుదల చేయనుంది. డ్వాక్రా మహిళలు.. స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని తెచ్చింది. దీని ద్వారా... ఇవాళ 78.94 లక్షల మంది పొదుపు సంఘాల మహిళల బ్యాంక్ అకౌంట్లలో రూ.6,419.89 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ నిధులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ బటన్ నొక్కి రిలీజ్ చేస్తారు. తద్వారా డ్వాక్రా మహిళలకు ఉపశమనం కలగనుంది. ఈ డబ్బును డ్వాక్రా మహిళలు దేనికైనా వాడుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
షెడ్యూల్ ఇదీ:
ప్రభుత్వ వర్గాల ప్రకారం సీఎం జగన్ ఇవాళ ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన ఇంటి నుంచి బయలుదేరతారు. ఉదయం 10.30కి ఏలూరు జిల్లాలోని దెందులూరు చేరుకుంటారు. 10.50 నుంచి 12.35 వరకూ బహిరంగ సభలో పాల్గొని.. వైయస్ఆర్ ఆసరా పథకం మూడో విడత నిధులను విడుదల చేస్తారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 1.05కి దెందులూరు నుంచి బయలుదేరి 1.35కి తాడేపల్లిలోని తన ఇంటికి వెళ్తారు సీఎం జగన్.
ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో సరిగ్గా ప్రచారం జరగట్లేదని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఈ ఆసరా పథకం కార్యక్రమాన్ని 10 రోజులు కొనసాగిస్తూ.. సంబరాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం ఏప్రిల్ 5 వరకు ఎంపీ, ఎమ్మెల్యేల అధ్వర్యంలో కార్యక్రమం కొనసాగనుంది.
2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు బ్యాంకుల్లో ఉన్న అప్పును ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే నిధులు విడుదల చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళల అకౌంట్లలో రూ.25,571 కోట్ల అప్పు ఉంది. ఈ అప్పును 4 విడతల్లో లబ్ధిదారులకు చెల్లించేలా వైఎస్సార్ ఆసరా పథకం తెచ్చింది ప్రభుత్వం. ఇప్పటివరకూ 2 విడతల్లో రూ.12,758.28 కోట్లు చెల్లించింది. మూడో విడతతో కలిపి మొత్తం రూ.19,178.17 కోట్లు ఇచ్చినట్లవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Ys jagan