ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) శుభవార్త చెప్పారు. గులాబ్ తుఫాన్ (Gulab Cyclone) కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని జమ చేశారు. మొత్తం 34,586 మంది రైతుల ఖాతాల్లో రూ.22 కోట్లను సీఎం జగన్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ సీజన్ లో జరిగిన నష్టానికి అదే సీజన్లో నష్టపరిహారం చెల్లిస్తున్నామని జగన్ తెలిపారు. ఈ రెండున్నరేళ్లలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.1071 కోట్లు ఇచ్చామన్నారు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వెల్లడించారు.
రైతుల కోసం వేల కోట్లు ఖర్చు...
తమ ప్రభుత్వం అధికారలోంకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ కోసం రూ.35వేల కోట్లు ఖర్చు చేశామన్న జగన్.. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రైతు భరోసా పథకం ద్వారా రూ.18,777 కోట్లు అందించినట్లు జగన్ చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బకాయిలను కూడా ఈ ప్రభుత్వం తీర్చిందని జగన్ గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ కు రూ.9వేల కోట్లతో పాటు విత్తన బకాయిలను కూడా తామే చెల్లించామన్నారు. అలాగే చంద్రబాబు హయాంలో ధాన్యం సేకరణ బకాయిలు రూ.961 కోట్లు చెల్లించినట్లు జగన్ తెలిపారు.
రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.18వేల కోట్లు ఇచ్చామన్నారు. పత్తి కొనుగోళ్లకు రూ.1800 కోట్లు ఖర్చు చేశామన్నారు జగన్. అలాగే ఇతర పంటల కొనుగోళ్లకు రూ.6వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. సున్నా వడ్డీ ద్వారా రూ.1,674 కోట్లు ఖర్చు చేశామన్నారు.
ప్రకృతి వైపరీత్యాలకు భయపడొద్దు...
అన్నదాతల కోసం ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ప్రతి అంశంలోనూ ఆర్బీకేలు రైతులకు సహకరిస్తున్నాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జగన్ భరోసా ఇచ్చారు. ప్రతి రైతుకు, ప్రతి ఎకరాకు పరిగారం అందిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జగన్ హామీ ఇచ్చారు. రబీ సీజన్ ముగిసేలోగానే ప్రతి ఎకరాకు నష్టపరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. రైతులకు అండగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని జగన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇన్ పుట్ సబ్సిడీ పొందిన రైతులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Farmers, Ysr raithu bharosa