గ్రామీణ ప్రాంతాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై కార్యాచరణ (జగనన్న స్వచ్ఛ సంకల్పం)తో పాటు, వైయస్సార్ జలకళ, గ్రామీణ తాగు నీటి సరఫరా (జల్‌జీవన్ మిషన్–జేజేఎం), వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు), గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రతి అంశంలోనూ ప్రభుత్వం సమర్ధవంతంగా ఉండాలని.. దులో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ అనేది చాలా ముఖ్యమన్నారు. క్లాప్ (క్లీన్ ఆంధ్రప్రదేశ్.. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ జయంతి రోజైన జూలై 8వ తేదీ ప్రారంభిస్తామన్నారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు కనిపంచడానికి వీల్లేదన్నారు. గ్రామాల్లో సీవేజ్ పంపింగ్ ఎలా ఉంది? ఆ నీటిని ఎలా డిస్పోస్ చేయడం ఎలా అన్నది చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మురుగునీటిని ఎక్కడ పడితే అక్కడికి తరలించొద్దని.., ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కి తరలించాలన్నారు. అలాగే సాలిడ్ వేస్ట్‌ను కూడా కాల్చి వదిలేయకుండా, ఏం చేయాలన్న దానిపై ఆలోచన చేయాలన్నారు. ప్రతి మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య కార్మికులకు వాక్సినేషన్‌మొదలు, యూనిఫామ్, గ్లౌజ్‌లు, మాస్క్‌లు, కోట్స్.. అన్నీ అదనంగా ఇవ్వాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎక్కడా ఏ లోపం లేకుండా అన్నీ సమకూర్చాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామాల్లో చెత్త సేకరణకు కానీ, ఇంకా దేనికైనా రుసుము వసూలు చేస్తే, సేవల్లో ఎక్కడా లోపం ఉండకూడదన్నారు.
‘మన ఊరును మనమే పరిశుభ్రంగా చేసుకుందాం’ అన్న నినాదంతో పనులు, కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ అదికారులను ఆదేశించారు. చెత్త సేకరణ కోసం సేకరించే ఈ–వాహనాల (ఎలక్ట్రిక్ వెహికిల్స్) నిర్వహణ భారం కాకుండా చూసుకోవాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, వీధి దీపాలు.. ఈ మూడింటిపైనే ఎక్కువ వ్యయం చేయాలన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో గ్రామాలు, పట్టణాలలో పూర్తి పారిశుద్ధ్యం కోసం మున్సిపల్ విభాగం కూడా పంచాయతీరాజ్‌తో కలిసి పని చేయాలన్న ముఖ్యమంత్రి.., మనసా వాచా కర్మణా ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకోవాలన్నారు. ఏ కార్యక్రమం అయినా కమిటెడ్‌గా పనిచేస్తేనే క్వాలిటీగా రిజల్ట్ వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. మే 1నుంచి 100 రోజుల పాటు గ్రామాల్లో శానిటేషన్‌పై కార్యాచరణ చేపడుతున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు.
వైయస్సార్ జలకళ
వైఎస్ఆర్ జలకళ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. చిన్న, మధ్య తరహా రైతులకు 1.5 లక్షల పంప్‌సెట్లు ఇవ్వాలని.., దీని ద్వారా 3 లక్షల రైతులు ప్రయోజనం పొందుతారని అంచనా వేస్తున్నామన్నారు. బోర్ వేయాలని ఏ రైతు దరఖాస్తు చేసినా, ఎప్పుడు ఆ బోర్ వేస్తామన్నది స్పష్టంగా చెప్పాలి. అందు కోసం ఎస్‌ఓపీ ఖరారు చేయాలని జగన్ ఆదేశించారు. తేదీ ఇస్తున్నామంటే, కేవలం బోరు వేయడం మాత్రమే కాదని... నీరు పడిన తర్వాత కచ్చితంగా నెల రోజుల లోపు, విద్యుత్ కనెక్షన్ ఇచ్చి, పంప్‌సెట్ బిగించాలని స్పష్టం చేశారు. సొంతంగా బోర్లు వేసుకున్న రైతులు ఎవరైనా పంప్‌సెట్‌లు కోరితే వారికి కూడా ఇవ్వాలన్నారు. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంధన శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
గ్రామీణ తాగు నీటి సరఫరా (జల్‌జీవన్ మిషన్ – జేజేఎం)
జగనన్న కాలనీలు కూడా ప్రభుత్వానికి చాలా ముఖ్యమని.. కావున ఈ కార్యక్రమంలో వాటిని కూడా చేర్చాలన్నారు. వాటర్ సోర్స్.., సరఫరా రెండూ ముఖ్యమేనని..,అందువల్ల నీటి సోర్సు, స్టోరేజీ, సరఫరా ఈ మూడింటిపై దృష్టి పెట్టి పనులు చేయాలన్నారు. జగనన్న కాలనీల్లో జల్‌జీవన్ మిషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని.. వేసవిలో నీటి వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి, ముందే పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో ట్యాంకులను ఎప్పటికప్పుడు (పీరియాడికల్‌గా) శుభ్రం చేయాలన్నారు.
వీధుల్లో ఎల్‌ఈడీ లైటింగ్ (జగనన్న పల్లె వెలుగు)
వీధి దీపాలు ఎల్‌ఈడీ వాడకం వల్ల ఏటా దాదాపు రూ.160 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. దాదాపు 4 లక్షల లైట్లు కావాలి. ఆ మేరకు కార్యాచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యావరణ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ గిరిజాశంకర్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మితో పాటు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government