ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై దాడుల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అంతర్వేది రథం దగ్ధం, విజయవాడ కనకదుర్గ గుడిలో వెండి విగ్రహాలు చోరీ, రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం వంటి ఘటనలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా రామతీర్థం విషయంలో రేగిన రాజకీయ అలజడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామతీర్థంలో రాజకీయ పార్టీలు మోహరించడం, పోలీసుల అరెస్టులు, రాళ్లదాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రామతీర్థంతో పాటు ఆలయాలపై దాడుల కేసులను విచారించే బాధ్యతను ప్రబుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీఐడీ ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టింది. ఘటన జరిగిన ప్రదేశాలు, అనుమానితులతో పాటు సోషల్ మీడియాపైనా పోలీసు శాఖ ప్రధాన దృష్టి పెట్టింది. నేపథ్యంలో రాష్ట్రంలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, మతాల మధ్య చిచ్చుపెట్టేలా పోస్టులు పెట్టడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వివాదాస్పద పోస్టులు-వ్యక్తి అరెస్ట్
మరోవైపు రామతీర్థంతో పాటు విగ్రహ ధ్వంసాలు, మత విద్వేషాలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ప్రవీణ్ చక్రవర్తి అనే పాస్టర్ ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. గుంటూరుకు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఫిర్యాదుతో ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు. ఇతర మతాలను కించపరిచేలా యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేయడమే కాకుండా., తానే విగ్రహాలను ధ్వంసం చేశానని, కొన్నిచోట్ల విగ్రహాలను కాలితో తన్నానంటూ వీడియోలో పేర్కొన్నాడు. ఏడాది క్రితం పోస్టైన వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇతర మతాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి అభియోగాలతో ప్రవీణ్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ తెలిపారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఇక రామతీర్థం ఘటనలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఘటనాస్థలి నుంచి కీలక అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసేందుకు ఉపయోగించిన ఎలక్ట్రిక్ రంపాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొత్తం 21 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాముడు విగ్రహాన్ని ధ్వంసం చేసింది, రాజమండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసింది ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆలయాల వద్ద భద్త పెంపు
వరుసదాడుల నేపథ్యంలో రాష్ట్రంలో ఆలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా స్పందించారు. గత ఏడాది సెప్టెంబరు 5వ తేదీ నుండి ఇప్పటి వరకు 58,871 దేవాలయాలకు జియో ట్యాగింగ్ తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. దీంతో పాటు 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు. అలాగే ఆలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100, లేదా దేవాలయాల కాల్ సెంటర్ నెంబర్ 9392903400 కు ఫోన్ చేయాలని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP DGP, AP Police, Damodar Goutam Sawang, Hindu Temples, Social Media