ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఒకే పథకంతో రెండు వర్గాలకు లబ్ధిచేకూర్చేలా ప్రణాళికలు అమలు చేయబోతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ పథకాన్ని ప్రజలకు అందించనుంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడిన రేషన్ సరుకుల డోర్ డెలివరీ సీఎం జగన్ ప్రారంభించబోతున్నారు. ఫిబ్రవరి 1 నుంచి రేషన్ సరుకుల డోర్ డెలివరీని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈనెల 21న రేషన్ డోర్ డెలివరీ వాహనాలను సీఎం లాంఛ్ చేయనున్నారు. అలాగే ప్యాకింగ్ బ్యాగులు కూడా అదే రోజు విడుదల చేయనున్నారు.
విజయవాడ బెంజిసర్కిల్ వేదికగా..
ఈ నెల 21వ తేదీన ఉదయం 9 గంటలకు విజయవాడ బెంజిసర్కిల్ సెంటర్లోనే ఈ వాహనాలను జగన్ ప్రారంభిస్తారు. గతంలో 108 వాహనాలు ప్రారంభంచిన మాదిరిగానే బెంజిసర్కిల్ వేదికగా ఒకేసారి 2,503 వాహనాలను జగన్ ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం అనంతరం వాహనాలను కృష్ణా, గుంటూరుతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలకు పంపిస్తారు.

రేషన్ డోర్ డెలివరీ వాహనం, రేషన్ బ్యాగ్ నమూనా
నిరుద్యోగ యువతకు ఉపాధి
రేషన్ డోర్ డెలివరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9260 మొబైల్ యూనిట్లు సిద్ధం చేసింది. అదే సంఖ్యలో అధునాతన వేయింగ్ మిషన్లు కూడా అందుబాటులోకి తెస్తోంది. అలాగే 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు సిద్ధం చేస్తోంది. రేషన్ డోర్ డెలివరీ వాహనాలను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో బీసీలకు 3875, ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్ మైనారిటీలకు 85 వాహనాలు కేటాయించారు. లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో వాహనాల అందించింది.

ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రేషన్ డోర్ డెలివరీ వాహనాలు
వాహనంలోనే అన్ని సౌకర్యాలు
డోర్ డెలివరీ వాహనాలను టాటా, సుజుకి సంస్థల ద్వారా డోర్ డెలివరీ ట్రక్కుల కొనుగోళ్లు చేసినట్టు సమాచారం. ఈ ట్రక్కులోనే సరుకులు తూకం వేసే కాంటాను అమర్చి.. ఇంటి దగ్గరే లబ్దిదారులకు రేషన్ అందించనున్నారు. ట్రక్కులో ఒక ఫ్యాన్, ఫైర్ ఎక్సటింగ్విషర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉంచనున్నారు. రేషన్ ట్రక్కు కాలనీలకు వెళితే.. అక్కడి లబ్దిదారులకు తెలిసే విధంగా ఎనౌన్సమెంట్ కోసం మైక్ సిస్టమ్‌ను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో డోర్ డెలివరీ వాహనాల ద్వారా రోజుకు 90 కార్డులకు సరకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 15 నుంచి 20 రోజులు వాహనాలు తిరిగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపకల్పన చేసింది
గతంలో పలుసార్లు వాయిదా..!
అయితే అర్హుల జాబితా సిద్ధం కాకపోవడం, వాహనాలు కూడా అనుకున్న సమయానికి అందే అవకాశం లేకపోవడంతో నెలరోజుల పాటు పథకాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటిరే రేషన్ సరుకుల పంపిణీని ప్రభుత్వం పలుసార్లు వాయిదా వేసింది. గత ఏడాది ఆరంభంలోనే నూతన రైస్ కార్డుల ద్వారా డోర్ డెలివరీ చేయాలని భావించినా.. కరోనా లాక్ డౌన్ కారణంగా.. పాత రేషన్ కార్డుల ఆధారంగానే పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం అంతా సర్దుకోవడంతో కొత్త రైస్ కార్డులను పరిగణలోకి తీసుకొని సరుకుల డోర్ డెలివరీ చేయాలని భావించింది. కానీ ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా వేస్తూ వస్తోంది. ఎట్టకేలకు రైస్ కార్డుల పంపిణీతో పాటు వాహనాలు సిద్ధమవడంతో పథకానికి శ్రీకారం చుట్టనుంది.