YS Jagan: పోలవరం పూర్తికి సీఎం జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే.. అధికారులతో ఏమన్నారంటే..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

పోలవరం ప్రాజెక్టుపై (Polavaram Project) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister YS Jaganmohan Reddy) దృష్టిపెట్టారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే చర్చ జరిగింది. ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయని, జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. రేడియల్‌ గేట్లలో 42 బిగించగా, ఇంకా 6 పెండింగులో ఉన్నాయని, వాటిని కూడా వేగంగా బిగిస్తామని అధికారులు తెలిపారు. జర్మనీ నుంచి మిగిలిన 14 హైడ్రాలిక్‌ సిలిండర్లు కూడా త్వరలోనే ఇక్కడికి చేరనున్నాయని సీఎంకు వివరించారు. ఇప్పటికే బిగించిన అన్ని గేట్లను పూర్తిగా ఎత్తిపెట్టి రాబోయే వరద నీటిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెలాఖరు కల్లా స్పిల్‌ ఛానల్‌ పనులు సేఫ్‌ స్టేజ్‌ దశకు చేరుకుంటాయని.., ఇప్పటికే ఎగువ కాఫర్‌ డ్యాంలో అక్కడక్కడ మిగిలిన పనులతో పాటు, వాటికి సంబంధించి సంక్లిష్టమైన పనులను పూర్తి చేశామని వివరించారు. ఇక కాఫర్‌ డ్యాంలోని అన్ని రీచ్‌లను జూన్‌ నెలాఖరు నాటికి 38 మీటర్ల ఎత్తుకు, అలాగే జూలై చివరి నాటికి పూర్తిస్థాయిలో పెంచుతామని అధికారులు తెలిపారు.

  ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టు అని అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టులో దిగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించిన మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సమీక్షించారు. ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టాలని అధికారులను ఆదేశించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసిన ఖర్చుకు సంబంధించి కేంద్రంలో బిల్లులు పెండింగులో ఉండడం సరికాదన్నారు. అధికారులు వెంటనే దీనిపై దృష్టి పెట్టాలన్న ముఖ్యమంత్రి.. చేసిన ఖర్చు వెంటనే రీయింబర్స్‌ అయ్యేలా చూడాలవన్నారు. వచ్చే మూడు నెలల కాలానికి కనీసం రూ.1400 కోట్లు ఖర్చు అవుతుందని.., డిల్లీ వెళ్లి వెంటనే పెండింగులో ఉన్న బిల్లులు క్లియర్‌ అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

  ఇది చదవండి: కరోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనందయ్య... మళ్లీ ఎప్పుడంటే..!


  యుద్ధప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉందన్న సీఎం.., అందుకే పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి డబ్బులు ఇస్తున్నామన్నారు.ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రాజెక్టు పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

  ఇది చదవండి: లక్ అంటే ఈ రైతుదే.., పొలంలో కోటిరూపాయల వజ్రం


  ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్టులు:
  వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం పైనా దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. నేరడి బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని అధికారులుకు దిశానిర్దేశం చేశారు. చర్చల కోసం ఇప్పటికే ఒడిశా సీఎస్‌కు లేఖ రాశామని, వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నామని.., త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశా అధికారులతో మాట్లాడతామన్న సీఎస్‌ ఆదిత్యానాథ్ దాస్ వివరించారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతుందని.., సంగం బ్యారేజీ పనులు కూడా 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి ఆ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. ఇక అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామని అందులో ఇంకా 116 మీటర్ల పని మిగిలి ఉందని వెల్లడించారు.

  ఇది చదవండి: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. కానీ మరో హెచ్చరిక


  ఇక వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్‌–1 పూర్తిగా సిద్ధమైందని వివరించిన అధికారులు.., టన్నెల్‌ –2 హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా అనుకున్న ప్రకారం ఆగస్టు నాటికి పూర్తి చేస్తామన్నారు. టన్నెల్‌– 2 నిడివి 18.787 మీటర్లు కాగా, ఇంకా 7.335 మీటర్ల పని మిగిలి ఉందని వివరించారు. పనులు ఆలస్యం కాకుండా, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెండో టన్నెల్‌ పనుల్లో కచ్చితంగా పురోగతి కనిపించాలని, వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని స్పష్టం చేశారు.

  వంశధార స్టేజ్‌–2, ఫేజ్‌–2 పనులపైనా సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.., పనులు వేగంగా నడవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా తీసుకున్నామని, అందువల్ల పనులు ఆలస్యం కావడానికి వీల్లేదన్న సీఎం అన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, నీటిపారుదల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
  Published by:Purna Chandra
  First published: