Andhra Pradesh: ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.., ఇకపై గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohanreddy) మరో శుభవార్త చెప్పారు. త్వరలోనే గ్రామ సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామన్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఇకపై స్థలాలు, పొలాల రిజిస్ట్రేషన్లకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవకాశం లేకుండా గ్రామసచివాలయాలనే రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్.., గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్యాచరణపై ప్రధానంగా చర్చించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తైన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో పనితీరును స్వయంగా చూసి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

  గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎప్పటికప్పుడు సిబ్బందికి వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు, సీనియర్‌ అధికారులతో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఎలాంటి అవాంతరాలు లేకుండా నిబంధనల ప్రకారం చేసే అవకాశం సిబ్బందికి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

  నిరంతర ప్రక్రియగా ఇళ్ల పట్టాల పంపిణీ
  ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలోనూ సీఎం జగన్ ప్రజలకు శుభవార్త చెప్పారు. ఇక నుంచి ఇళ్ల పట్టాల పంపిణీని నింతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. అర్హులు దరఖాస్తు చేస్తున్న 90 రోజుల్లో ఇంటిస్థలం మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న ఇళ్లపట్టాల పంపిణీని ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి లబ్ధిదారునికి నేరుగా పట్టా అందిస్తున్నామన్న అధికారులు.., ఇంటి స్థలం ఎక్కడో చూపిస్తున్నామని వివరించారు.

  వేగంగా భూమల రీ సర్వే
  సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే రెండు స్థాయిల్లో పరీక్షలు నిర్వహించామన్న అధికారులు.., రెండో స్థాయిలో 92శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహించి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధిత అంశాలపై సమర్థతను పెంచడానికి అవగాహన, శిక్షణ, పరీక్షలు కూడా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

  కొత్త కాలనీల్లోనూ సర్వే..!
  రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసి నిర్మిస్తున్న కాలనీలను కూడా సర్వేలో చేర్చాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సర్వే మ్యాప్ లు తయారీలో వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. కాలనీల్లో ప్రతి ఇంటికీ ప్రతి ఇంటికీ యూనిక్ ఐడీ నెంబర్ ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది సర్వే విధులకు వెళ్తున్న సందర్భంలో ప్రతిరోజూ 2గంటల పాటు ప్రజల ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.

  ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్‌ ఆదిత్యనాద్‌ దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
  Published by:Purna Chandra
  First published: