Andhra Pradesh: వీర జవాన్ల కుటుంబాలకు అండగా సీఎం జగన్... భారీ ఆర్ధికసాయం

ఏపీ సీఎం వైఎస్ జగన్(ఫైల్ ఫొటో)

ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో వీరమరణం పొందిన జవాన్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) అండగా నిలిచారు.

 • Share this:
  ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో (Chhattisgarh Attack) జవాన్ల మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు. ఈఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢసంతాపాన్ని తెలిపారు. ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామన్న సీఎం.. భారీ పరిహారాన్ని ప్రకటించారు. విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో రూ.30లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపన అన్నిరకాలుగా ఆదుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపుర్‌లో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం 22 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన రౌతు జగదీష్, గుంటూరు జిల్లాకు చెందిన మురళీ కృష్ణ అన్నారు.

  విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు, సీఆర్పీఎఫ్‌ జవాన్‌ 27 ఏళ్ల రౌతు జగదీష్‌ వీరమరణం పొందాడు. జిల్లా పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. జగదీష్‌ది మక్కువ మండలం కంచేడువలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజులరేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్‌ 2010లో సీఆర్పీఎఫ్‌ జవాన్‌గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రాదళానికి లీడర్‌గా ఎంపికయ్యాడు. బీజాపూర్‌లో సీఆర్‌పీఎఫ్, కోబ్రా, డీఆర్‌జీ భద్రతా దళాలతో కలిసి కూంబింగ్‌ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతిచెందాడు.

  విధుల్లో చేరిన కొద్దికాలంలోనే మంచిపేరు సంపాదించాడు. మృతుడి తండ్రి సంహాచలం కూలీకాగా, తల్లి రమణమ్మ గృహిణి. కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైనట్టు తెలుస్తోంది. అయితే జగదీష్ కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చమైంది. ఆ పెళ్లికోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలి అనుకున్నాడు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమమంలో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని శోకసంద్రంలోకి నెట్టేసింది

  ఇదే ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా కమాండర్‌ శాఖమూరి మురళీకృష్ణ మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. శాఖమూరి రవి, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వెంకటమోహన్‌ కాగా... చిన్నకుమారుడు మురళీకృష్ణ.. మురళీకృష్ణ 2010లో సీఆర్‌పీఎఫ్ కు ఎంపికయ్యాడు. మురళీ కృష్ణకు త్వరలోనే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే కొత్త ఇల్లు నిర్మించారు. ఈ వేసవిలో వివాహం జరిపించేందుకు కుటుంబసభ్యులు సంబంధాలు చూస్తున్నారు. రెండు నెలల క్రితం సెలవుపై ఇంటికి వచ్చిన మురళీ కృష్ణ... ఈసారి పెళ్లి చేసుకునేందుకు వస్తానని స్నేహితులు, బంధువులకు చెప్పి వెళ్లాడు. ఇంతలోనే మురళీకృష్ణ వీరమరణం పొందడం అందర్నీ శోకసంద్రంలో ముంచేసింది.
  Published by:Purna Chandra
  First published: