news18-telugu
Updated: September 3, 2020, 2:21 PM IST
Online Rummy (ప్రతీకాత్మక చిత్రం)
Online Poker: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించింది. ఆన్ లైన్లో పేకాట రమ్మీ, పోకర్ లాంటి జూడ క్రీడలను నిషేధిస్తూ ఈ రోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అందులో ప్రధానంగా ఆన్ లైన్ పేకాట మీద కూడా చర్చ జరిగింది. ఆన్ లైన్ విప్లవం అనేది ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనుకుంటే, కొందరు డబ్బు కోసం ఆన్ లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆన్ లైన్ రమ్మీ, పోకర్పై నిషేధం విధించాలని నిర్ణయించారు. ఇకపై ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూద క్రీడలను నిర్వహిస్తారో వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు. అలాగే, ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 3, 2020, 2:21 PM IST