ANDHRA PRADESH ASSEMBLY BUDGET SESSIONS START FROM TOMORROW FIRST TIME GOVERNOR WILL SPEACH DIRECTOR NGS
AP Budget: రేపటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు.. తొలిసారి గవర్నర్ ప్రసంగం.. ఉత్కంఠ పెంచుతున్న కీలక బిల్లులు
అసెంబ్లీలో వైఎస్ జగన్ (File)
AP Budget: ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. తొలిసారి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ సభలో ప్రసంగించనున్నారు.. దీంతో ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించారు అధికారులు.. మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లో అమరావతిపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందన్నదానిపై ఉత్కంఠ.
AP Budget: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (ap assembly budget session) రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. అయితే ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhusan harichandan) బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శాసనసభకు నేరుగా హాజరు అవుతున్నారు. ఎందుకంటే కరోనా నేపథ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ వర్చువల్ విధానంలో ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు. అందుకే ఆయన తొలిసారి నేరుగా సభకు వచ్చి సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా నేతృత్వంలో రాజ్ భవన్ అధికారులు పూర్తి స్ధాయి ట్రయల్ రన్ ను నిర్వహించారు.
సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 8న ఇటీవల గుండెపోటుతో మరణించిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అసెంబ్లీ సంతాప తీర్మానం చేసి నివాళులర్పించనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.
అయితే ఈ సారి బడ్జెట్ సమావేశాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకంటే తాజాగా ఏపీ రాజధాని అమరావతే అని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాని ప్రభుత్వం మాత్రం మూడు రాజధానులు వచ్చి తీరుతాయి అని చెబుతోంది. దీంతో ప్రభుత్వం రేపు సభలో ఎలా ముందుకు వెళ్తుందన్నది ఆసక్తి పెంచుతోంది. అలాగే కొత్త జిల్లాల పునర్ విభజన బిల్లు కూడా అసెంబ్లీ ముందుకు వస్తోంది. దీంతో పాటు పలు కీలక బిల్లులు సైతం అసెంబ్లీ ముందుకు రానున్నాయి. అందుకే టీడీపీ సైతం మొదట అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా.. కీలక బిల్లులు వస్తున్న నేపథ్యంలో సభకు హాజరు కావాలని నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు మాత్రం చేసిన శపథం ప్రకారం సమావేశాలకు దూరంగా ఉంటారు. ఇతర నేతలు మాత్రం హాజరయ్యి.. ప్రజా సమస్యలపై తమ గళం వినిపించనున్నారు.
మరోవైపు కొత్త జిల్లాల పునర్ విభజన ప్రక్రియ గురించి గవర్నర్ బిశ్వ భూషణ్‌కు సీఎం జగన్ వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులు, కొత్త జిల్లాలే ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.