• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • ANDHRA PRADESH ANTI CORRUPTION BUREAU RAIDS CONTINUING IN KANAKA DURGAMMA TEMPLE AT INDRAKEELADRI IN VIJAYAWADA HERE ARE THE DETAILS PRN

Durga Temple: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఏసీబీ సోదాలు... టీడీపీ ప్రభుత్వ చెల్లింపులపైనే టార్గెట్

Durga Temple: ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న ఏసీబీ  సోదాలు... టీడీపీ ప్రభుత్వ చెల్లింపులపైనే టార్గెట్

విజయవాడ దుర్గగుడి (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడలోని (Vijayawada) ఇంద్రికీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో (Kanakadurga Temple) ఏసీబీ (ACB) సోదాలు కొనసాగుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై అవినీతి నిరోధక శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా కొనసాగుతున్న సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దుర్గమ్మ ఆలయంలో అవినీతిపై సమాచారంతో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో అమ్మవారి దర్శన టికెట్ల విక్రయం, ఆలయంలో సరుకుల కొనుగోళ్లు, నాణ్యత, అభివృద్ధి పనులు, వివిధ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్ల టెండర్ల కేటాయింపు వంటి కీలక అంశాలపై ఏసీబీ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అలాగే ఆలయ ఈవో సురేష్ బాబు, సూపరిటెండెంట్  స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. అమ్మవారి ఆలయంలో జరిగిన కీలక లావాదేవీలకు సంబంధించిన బిల్లులను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన 30 మంది అధికారులతో కూడిన బృందం సోదాల్లో పాల్గొంది.

    ముఖ్యంగా అభివృద్ధి పనుల బిల్లులు, సరుకుల కొనుగోళ్లు, టికెట్లు, చీరల విక్రయం, తలనీలాల టెండర్లు, సెక్యూరిటీ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాల చెల్లింపుతో పాటు ఫెర్రీలో స్క్రాప్ విక్రయాలకు సంబంధించిన బిల్లులను అధికారులు సేకరించారు. అలాగే ఫెర్రీలో స్క్రాప్ విక్రయించగా వచ్చిన సొమ్మును ఎక్కడ డిపాజిట్ చేశారనేదానిపై వివరాలు తీసుకున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.58 కోట్ల చెల్లింపులకు సంబంధించిన వివరాలపై ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు పరిశీలంచిన అంశాల్లో లెక్కలు తేలనట్లుగా తెలుస్తోంది. అలాగే అంతర్గత బదిలీలు, టెండర్లలో అవకతవకలను గుర్తించినట్లు  వార్తలు వస్తున్నాయి.  సోదాలు పూర్తైన తర్వాత ప్రభుత్వానికి పూర్తి నివేదిక సమర్పించే అవకాశముంది.

    ఇది చదండి: కుక్కర్లు, గౌన్లు, స్టూళ్లు కోళ్లకు డిమాండ్.. పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్..


    కనకదుర్గ ఆలయంలో ఏసీబీ దాడులపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. సాధారణంగా వచ్చే ఫిర్యాదుల్లో భాగంగానే ఏసీబీ దాడులు చేస్తోందన్నారాయన. ఎక్కడ తప్పుజరిగినా దాని వెనుక ఎవరున్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని  స్పష్టం చేశారు.  సీఎం వైఎస్ జగన్ ఏసీబీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారని.. అందులో భాగంగా అవినీతి పరుల వేట సాగుతోందన్నారు.


    తరచూ వివాదాలు

    ఇటీవల కనకదుర్గమ్మ ఆలయం తరచూ వివాదాల్లో నిలుస్తోంది. అమ్మవారి వెండిరథంపై సింహాల ప్రతిమల అదృశ్యమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో దాదాపు నాలుగు నెలల విచారణ అనంతరం నిందితులను పట్టుకున్నారు. చోరీ చేసిన వెండిని కూడా అధికారులు రికవరీ చేశారు. అలాగే దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ప్రత్యేక దర్శనం టికెట్లు ధరలు పెంచడం, కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా భక్తులను అనుమతించడం, ముందస్తు బుకింగ్ లేకుండా ఆలయానికి వచ్చిన వారికి అధిక ధరలకు టికెట్లు విక్రయించి దర్శనానికి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

    అలాగే అమ్మవారి హుండీ లెక్కింపులోని ఆలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. నవరాత్రుల తర్వాత ఇద్దరు ఆలయ సిబ్బంది హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించగా.. వారి దగ్గర నగదు రికవరీ చేసి పంపారే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. హుండీ లెక్కింపు సమయంలో ఆలయ అధికారులు నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఇక భవానీ దీక్షల విరమణ సందర్భంగానూ అవకతవకలు జరిగినట్లు ప్రచారం జరిగింది. అలాగే గతంలో అమ్మవారి చీరలు మాయమైన ఘటనపై కూడా ఆలయ అధికారులు, పాలకమండలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
    Published by:Purna Chandra
    First published: