news18-telugu
Updated: July 2, 2020, 3:29 PM IST
ప్రతీకాత్మక చిత్రం
జూన్ నెల ముగిసింది. నైరుతి రుతుపవనాల్లో అత్యంత కీలకమైన మొదటి నెల పూర్తయింది. మరి, నైరుతి రుతుపవనాలు మొదటి నెలలో ఎంతవరకు మేలు చేశాయి? తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతమేర వర్షాలు పడ్డాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ విషయాన్ని లెక్కలతో సహా ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 2020 జూన్ 1వ తేదీ నుంచి 2020 జూన్ 30వ తేదీ వరకు గణించిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో సాధారణం కంటే 20 శాతం, తెలంగాణలో 30 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఏపీలో సగటు వర్షపాతం 93.7 శాతంగా అంచనా వేస్తే.. వాస్తవంగా 113. 1 శాతం వర్షపాతం రికార్డయింది. అంటే సుమారు 20.7 శాతం అధికంగా వర్షం పడింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో సాధారణంగానే వర్షపాతం నమోదు కాగా, మిగిలిన జిల్లాలు అన్నింట్లోనూ అధిక వర్షపాతం రికార్డయింది. ఇక తెలంగాణలోని వనపర్తి జిల్లాలో అత్యధికంగా 141 శాతం అధికవర్షపాతం నమోదు కాగా, జగిత్యాల జిల్లాలో 18 శాతం తక్కువ వర్షపాతం రికార్డు అయింది.
నైరుతి రుతుపవనాలు తొలిదశలో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రకు ఆశాజనకంగా ఏమీ లేవు. ఈ రాష్ట్రాల్లో 25 శాతం నుంచి 40 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. ఆయా రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందు అంచనా వేసింది. అయితే, తాజాగా రిలీజ్ చేసి డేటాను చూస్తే తక్కువ వర్షపాతం నమోదైనట్టు ఐఎండీ తెలిపింది. కర్ణాటకలో 25 నుంచి 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. కేరళలో కూడా 17 శాతం తక్కువ వర్షపాతం రికార్డయింది. ఇక మహారాష్ట్ర, గోవాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఈలెక్కన మిగిలిన మూడు నెలల కాలానికి ఐఎండీ ఇచ్చిన అంచనా ఎంతమేర ఫలిస్తుందో అని ఆందోళన రైతుల్లో ఉంది. ఇప్పటికే కరోనా వల్ల కేంద్రం పేదలకు ఉచితం బియ్యం, గోధుమల పంపిణీని నవంబర్ వరకు పొడిగించింది. ఈ సారి వర్షపాతం పూర్తిగా పండకపోతే ఆహారధాన్యాల దిగుబడి తగ్గే ప్రమాదం పొంచి ఉంది.
First published:
July 2, 2020, 3:29 PM IST