ఆంధ్రప్రదేశ్ లో పండగులు, జాతరల్లో రికార్డింగ్ డాన్సులు, ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం సర్వ సాధారణం. ఒక్క ఏపీలోనే కాదు.. దేశంలోని చాలా ప్రాంతాల్లో పండగులు, పబ్బాల సమయంలో ఇలాంటివన్నీ చెల్లుబాటవుతాయి. కానీ జాతీయ దినోత్సవాల్లో పిచ్చిపిచ్చి డాన్సులు పెట్టారు కొందరు అధికారులు. విద్యార్థులకు దేశభక్తిని బోధించాల్సిన కార్యక్రమంలో స్వామిభక్తిని ప్రదర్శించారు. అదెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ నడిబొట్టున ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో. యూనివర్సిటీ ప్రాంగణంలో అధికారులు రిపబ్లిక్ డే వేడుకలకు భారీ ఏర్పాట్లే చేశారు. వేడుకల్లో అదికారులే కాదు కొంతమంది స్టూటెండ్స్ ప్రవర్తన కూడా శ్రుతిమించింది. దేశభక్తి, భరతమాతకు సంబంధించిన పాటలు వినిపించాల్సిన చోట రాజకీయ పాటలు పెట్టారు. సీఎం జగన్ ను పొగుడుతున్న పాటలను ప్లే చేశారు.
భరతమాత వేషధారణలో ఉన్న విద్యార్థిని మధ్యలో నిల్చే బెట్టి.., సీఎం జగన్ పై రూపొందించిన పాటలకు డాన్సులు వేశారు. నాగార్జున యూనివర్సిటీ ఇన్ ఛార్జ్ వైఎస్ ఛాన్సిలర్ సమక్షంలోనే ఈకార్యక్రమం జరిగింది. దేశభక్తి పాటలు ప్లే అవుతున్న సమయంలో ఉన్నట్లుండి సీఎం జగన్ కు సంబంధించిన పాటలు ప్లే చేయడంతో కార్యక్రమానికి వచ్చిన అతిథిలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థి సంఘాలు అవాక్కయ్యారు. పాటలు ప్లే అవుతున్న సమయంలో వర్సిటీ అదికారులు కూడా వారించలేదు.
ఈ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది. ఇన్ ఛార్జ్ వీసీని తొలగించాలని విద్యార్థులతో పాటు అక్కడికొచ్చిన అథితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐతే ఇది కావాలనే ప్లే చేశారా.. లేక పొరబాటున ప్లే అయిందా అనేది ఇంకా తేలలేదు. ఏది ఏమైనా భరతమాత వేషధారణలో ఉన్న విద్యార్థిని ఎదుట ఇలాంటి డాన్సులు వేయడాన్ని ప్రతి ఒక్కరూ తప్పుబడుతున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, Republic Day 2021